MLA Padi kaushik Reddy Comments on CM Revanth : అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం అయ్యాక వాటి గురించి మర్చిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, పింఛన్లు రూ.2,000 నుంచి రూ.4,000, వికలాంగుల పింఛన్లు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామన్నారని, ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు.
ప్రశ్నించిన గులాబీ నేతలపై దాడులా? : ఇంట్లో అవ్వా, తాతలకు పింఛన్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి, గడచిన ఆరు నెలల్లో మూడు నెలల పాటు పింఛన్లు ఆపారన్నారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, రేవంత్ రెడ్డికి లేదన్న కౌశిక్ రెడ్డి, పింఛన్లపై రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తామన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆక్షేపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆంధ్రాలో ఏం జరిగిందో అదే మళ్లీ పునరావృతమవుతుందని హస్తం నేతలు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.
"మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన 44,82,274 మంది పింఛన్‌దారులను మీ సర్కార్ వచ్చాక ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారు? ఎందుకు పింఛన్లను పెంచటం లేదు. మీరు ఇచ్చిన వంద రోజుల హామీనే దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతుంది. ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇదే అంశంపై మేము అడిగితే దాడులకు దిగుతున్నారు."- పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
Padi kaushik Reddy Comments on Protocol Issue : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండానే కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారన్న ఆయన, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మార్వోలకు స్వయంగా లెటర్ రాసినా మంత్రి రావాలని చెబుతూ చెక్కులను ఆపుతున్నారన్నారు. అధికారులు ప్రొటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే, హై కోర్టుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు - నివేదిక కోరిన సీఈసీ - కేసు నమోదు చేసిన కమలాపూర్ పోలీసులు