Rajiv Gandhi Birth Anniversary Celebrations at Gandhi Bhavan : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షి రాజీవ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
దేశంలో ఐటీ విప్లవానికి నాడు రాజీవ్‌గాంధీ నాంది పలికారని భట్టి కొనియాడారు. విశ్వనగరం హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాది వేయగా ఆ తర్వాత పరిశ్రమ రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్తోందని తెలిపారు. మొబైల్, పాల ఉత్పత్తి, ప్రతి పల్లెకు మంచినీరు, 18 సంవత్సరాలకే ఓటు హక్కు, భారతదేశంలో ఐటీ విప్లవం సృష్టించింది రాజీవ్ గాంధీయేనని పేర్కొన్నారు.
ఐటీ విస్తరణకు కృషి చేసిందో ఎవరో తెలియదా? : అమెరికా, కొరియా దేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి హైదరాబాద్ నగరానికి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. విదేశాల్లో చదువుకున్నాం అని చెప్పుకునే వాళ్లు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశా అని చెప్పుకునే వ్యక్తికి హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు కృషి చేసింది ఎవరో తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ప్రణాళికతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడేలా కార్యాచరణ సిద్ధం చేసుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా వెళుతుందని ఆయన అన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలు ఇచ్చిన భూములను తిరిగి వారికే ఇస్తాం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, శివసేనా రెడ్డి, కుమార్ రావ్ మెట్టు సాయి కుమార్, ప్రీతమ్, సునీత రావ్, ఇతర నేతలు పాల్గొని రాజీవ్‌గాంధీకి నివాళులు అర్పించారు.