Balineni Sensational Comments on YS Jagan: ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలని వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆపార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లాకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నాయకులు లేక ప్రకాశం జిల్లా ఏమైనా గొడ్డుపోయిందా అని బాలినేని వ్యాఖ్యానించారు.
తాను కార్యకర్తల గురించి ఆలోచిస్తానని, ప్రకాశం జిల్లాకి చెందిన వారికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయంపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలో కాకరేపుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఆయన మాట్లాడారు.
ఇప్పటికే ఘోర పరాభవంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నడిపించే నాయకుడు లేకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు పార్టీ మారేందుకు పలువురు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ జిల్లా బాధ్యతలనూ ఎంపీగా ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇచ్చేందుకు జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు తొలిసారిగా నగరానికి వచ్చారు.
పార్టీ శ్రేణుల్లో గందరగోళం: గతంలో 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు బాలినేని క్యాడర్ అందుబాటులో లేరు. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఘోరంగా బాలినేని ఓడిపోయారు. దీంతో ఇప్పుడు కూడా గతంలో మాదిరి క్యాటర్కు అందుబాటులో ఉండరు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలకు సైతం బాలినేని దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితులతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
చెవిరెడ్డికి జిల్లా బాధ్యతలు: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయంపై తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి పనితీరు అంతంతమాత్రంగా ఉండటంతో పాటు ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం నేపథ్యంలో ఈ మార్పు చేస్తున్నట్లు సమాచారం. అయితే బాలినేనితో పాటు జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైఎస్సార్సీపీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలు సైతం ఆ పార్టీలో కాకరేపుతున్నాయి.