Authors Pending Bills During YSRCP Govt: సమాజాన్ని చైతన్యపరిచేందుకు రచనలు చేసేటువంటి కవులు, రచయితలు వారు. వారి నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకుండా కాలం వెళ్లదీసింది. మూడేళ్ల క్రితం తమ వద్ద ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేసి నిధులు లేవంటూ కారణాలు చెప్పిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రచయితలు, పబ్లిషర్స్ పుస్తకాల కొనుగోలు కోసం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ 2020-21 కోసం ప్రకటన విడుదల చేసింది. వచ్చిన పుస్తకాలను పరిశీలించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్.. ఆమోదించిన పుస్తకాల జాబితా విడుదల చేసింది. దీనినే సైటేషన్ అంటారు. జిల్లాల వారీ కొనుగోలు కమిటీల నేతృత్వంలో రచయితలు, కవులు, పబ్లిషర్ల నుంచి సుమారు 50 శాతం తక్కువ మొత్తానికి పుస్తకాలను కొనుగోలు చేశారు. అన్ని గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు వచ్చిచేరాయి. కానీ వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని మాత్రం ఇవ్వలేదు. మూడేళ్లుగా రచయితలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థకు సరాసరిన 40 లక్షల రూపాయల వరకు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. కవులు, రచయితలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటంతో తిరిగి కొత్త పుస్తకాలు అచ్చు వేసుకోలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వందలకు మందికిపైగా సాహితీవేత్తలకు చెల్లించాల్సిన మొత్తం 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సాహిత్య సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం సాహితీవేత్తలను ఆదుకోవాలని కోరుతున్నాయి.
"డబ్బులు నేరుగా రచయిత ఖాతాలో నగదు జమ చేస్తామని గ్రంథాలయ సిబ్బంది చెప్పారు. ఇందుకోసం కావల్సిన జెరాక్స్ కాపీలను తీసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ రచయితల ఖాతాలో నగదు జమ చేయలేదు. వైఎస్సార్సీపీ పాలనలో రచయితలను చాలా ఇబ్బందులకు గురిచేసింది." - మోహన్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు
"రెండు మూడేళ్ల క్రితం రచయితలు, పబ్లిషర్స్ నుంచి ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేసింది. నాలుగైదు జిల్లాలకు బిల్లులు చెల్లించాయి. మిగిలిన జిల్లాలకు మాత్రం నగదు చెల్లించలేదు. కొత్త ప్రభుత్వమైనా రచియతలు, పబ్లిషర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాము." - అజీజ్, ప్రసిద్ధ చారిత్రక నవలాకారుడు