Lands Encroachment in YSRCP Rule at AP : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డారు. నకిలీ పత్రాలు సృష్టించి, విలువైన భూములను కొట్టేశారు. ఈ అక్రమాలపై కూటమి సర్కార్ విచారణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ వివరాలను సేకరిస్తున్నారు.
Inquiry on Land Irregularities in AP : వైఎస్సార్సీపీ హయాంలో అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. వీటిని పేదల నుంచి తక్కువ ధరకు ఆ పార్టీ పెద్దలు, వారి అనుచరులు కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన అన్ని రకాల భూముల వివరాలను పంపాలని రిజిస్ట్రేషన్ శాఖ అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ వచ్చాక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం.
ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్న ప్రభుత్వం : రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఇటీవలే బదిలీ అయిన రామకృష్ణ హయాంలోనే వైఎస్సార్సీపీ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఐజీగా రామకృష్ణ ఉన్నప్పుడు తీసుకొచ్చిన కార్డు 2.0 సాఫ్ట్‌వేర్ పనితీరులో చాలా సమస్యలు ఉన్నాయి. వివాదాస్పద ఇ-సంతకం విధానాన్ని తొలగించి సాధారణ విధానాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నారు. అంతేకాకుండా కాకుండా సాఫ్ట్‌వేర్ చేసిన క్రిటికల్ రివర్ సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నారు.
గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ పొందినవారిని తిరిగి సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. మొత్తం సుమారు 30 మంది డిప్యుటేషన్లు పొందినట్టు గుర్తించారు. ఇప్పటికే పలువురి డిప్యుటేషన్లు రద్దయ్యాయి. ఐజీ రామకృష్ణకు అన్ని విధాలుగా సహకరించారనే ఆరోపణలున్న సంజీవయ్యను తప్పించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగినట్టు ప్రస్తుతం గమనించారు. ఇంతకుముందు 48 గంటల్లో చేసుకునేందుకున్న వెసులుబాటును వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంటల్లోనే చేయాలని పెట్టడంతో అనేక సమస్యలొచ్చాయి. దీన్నీ పునఃసమీక్షిస్తున్నారు.