AP Cabinet Key Discussion on Polavaram Project Funds: పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిగతులపై చర్చించి అవసరమైన నిధుల విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేయడమే ప్రధాన ఎజెండాగా గురువారం మంత్రిమండలి సమావేశమై చర్చించింది. ప్రధానంగా నాలుగు అంశాలతో తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేలా, డీపీఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలూ దక్కేలా చేపట్టే పనులకు పూర్తిగా నిధులను కేంద్రమే ఇవ్వాలని తీర్మానించారు.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వరద తగ్గిపోయిన తర్వాత నవంబరు నెల నుంచి వేగంగా పనులు చేసుకునేలా అవసరమైన అనుమతులు, డిజైన్లకు అనుమతుల విషయంలో కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినందుకు రాష్ట్ర మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది.
తీర్మానం ఆమోదించేందుకు ముందు పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులను కేబినెట్ సభ్యులకు సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఎంత మేర నిర్మాణం జరిగింది? ఆ తర్వాత 2019-2024 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు స్తంభించిపోవడం, 2020లో భారీ వరదలకు డయాఫ్రం వాల్ ధ్వంసం అవడం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ వల్ల వాటిల్లిన నష్టాలపై క్లుప్తంగా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
గుత్తేదారు మార్పే పోలవరానికి శాపం- స్పష్టంచేసిన కేంద్రం - Polavaram Issue in Lok Sabha
2019 నాటికే పోలవరం ప్రాజెక్టును 72 శాతం మేర పూర్తి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేంద్రం వద్దని చెప్పినా అప్పటి గుత్తేదారును మార్చేసి కొత్తగా టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారులకు పనులు అప్పగించిందన్నారు. 2019 తర్వాత దాదాపు 13 నెలల పాటు పోలవరంలో అధికారులు, గుత్తేదారు.. ఎవరూ బాధ్యత వహించలేదని దీంతో పనులు స్తంభించిపోయాయని చెప్పారు.
ఫలితంగా ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్‌లను 2020 జులై నాటికి కూడా పూడ్చలేదన్నారు. ఆ ఏడాది వచ్చిన భారీ వరదలకు పోలవరంలోని ఎగువ కాఫర్ డ్యాం ఖాళీల మీదుగా పెద్ద ఎత్తున వరద ప్రవహించి వడి పెరిగి ప్రధాన డ్యాం ప్రాంతంలో 50 మీటర్ల లోతు వరకు ఇసుక కొట్టుకుపోయి పెద్ద పెద్ద అగాథాలు ఏర్పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్ ఆ వరదకు దెబ్బతిందని వివరించారు. ఆ తర్వాత నిపుణుల కమిటీలు పరీక్షించి డయాఫ్రం వాల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారని, అనేక చర్చల తర్వాత కేంద్ర జలసంఘం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే మొగ్గు చూపిందని ఆయన తెలిపారు. విదేశీ నిపుణుల బృందం కూడా పోలవరం పనులను పరిశీలించిందని.. వారు తమ నివేదికను ఇవ్వాల్సి ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పోలవరం పనులు వెనకబడటానికి కారణం జగన్: మంత్రి నిమ్మల - Ministers Fires on Jagan