Ramoji Rao Success Story : రామోజీరావు స్వయంకృషితో ఎదిగి, తెలుగు వారికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన దార్శనికుడు. మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన కృషీవలుడు. అనితరసాధ్యమైన పట్టుదల, క్రమశిక్షణలతో సంపద సృష్టించి వేల మందికి ప్రత్యక్షంగా, మరెన్నో వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన పారిశ్రామికుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మీడియా, వినోదం, ఆర్థిక, ఆతిథ్య, వ్యాపార రంగాల్లో ఆయన ఒక ఎవరెస్టు శిఖరం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని వైవిధ్యమైన పనులను చేయగలరా, ఇన్నిన్ని విజయాలు సాధించగలరా అని ఆశ్చర్యపోయే విజయ ప్రస్థానం ఈ పద్మవిభూషణుడిది!
రామోజీరావు అసలైన సంపద విశ్వసనీయత. 50 ఏళ్లుగా ఈనాడు ప్రజాభిమానం పొందడానికి ఆయనపై ప్రజలకున్న అచంచల విశ్వాసమే కారణం. అతి సున్నితమైన మార్గదర్శి వంటి ఆర్థిక సంస్థపై ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాలను, దాడులను ‘ప్రతి పైసాకూ నాదీ పూచీ’ అని ఆయన అన్న నాలుగు భరోసా మాటలే తులసిదళంలా అడ్డుకున్నాయి. ప్రజలపై ఆయనకు చిన్న చిన్న వదంతులు సైతం ప్రభుత్వ రంగ బ్యాంకులను, బలమైన ప్రైవేట్ రంగ బ్యాంకులను ఎలా అతలాకుతలం చేశాయో అంతో ఇంతో ఆర్థిక పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలిసిందే.
పత్రికొక్కటున్న పదివేల సైన్యమ్ము : పత్రికను వ్యాపారంగా కాక ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించారు రామోజీరావు. పత్రికొక్కటున్న పదివేల సైన్యమ్ము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకురక్ష లేదు పత్రిక లేకున్నఅన్న నార్ల వెంకటేశ్వరరావు మాటలు రామోజీరావు స్థాపించిన ఈనాడుకు అతికినట్లు సరిపోతాయి. ఈనాడు దినపత్రికను ప్రారంభించిన నాలుగేళ్లలోనే అగ్రస్థానానికి చేర్చారాయన. 46 ఏళ్లుగా దీన్ని శిఖర స్థానంలో నిలుపుతూ వచ్చారు. సర్క్యులేషన్, రీడర్‌షిప్ పరంగా ఒక తెలుగు దినపత్రికను దేశంలోనే మేటి పత్రికగా తీర్చిదిద్దారు.
వాడుక భాషలో వార్తారచన, స్థానిక అంశాలకు ప్రాధాన్యం, ఆకర్షణీయమైన రూపు, సూర్యోదయానికి ముందే పత్రిక పంపిణీలతో ఈనాడును కొత్తపుంతలు తొక్కించారు. ప్రజా జీవితంతో ముడిపడిన అంశాలే ముడి సరకులుగా పత్రికను నడిపించారు. ఈనాడు జిల్లా ఎడిషన్లు, నియోజకవర్గ పేజీల ద్వారా రోజూ వందలాది పౌర సమస్యలు పరిష్కారమయ్యేలా పత్రికను తీర్చిదిద్దారు.
పత్రికలో తొలినుంచీ చేసిన అనేక ప్రయోగాల వల్ల జాతీయ స్థాయిలో గౌరవం పొందారు. ప్రజల చేతిలో పత్రికను ఒక అస్త్రంగా మలిచారు. ప్రజలకు ఏ చిన్న ఆపద వచ్చినా రామోజీరావు అండగా నిలిచారు. తెలుగు సమాజంలో పెనుమార్పులకు బాటలు పరిచారు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పునర్లిఖించడంలోనూ, 1984లో ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం ద్వారానూ దేశవ్యాప్తంగా ఈనాడు పేరు మారుమోగింది.
సాహసికుడు : ఈనాడు సంపాదకుడిగా ఎక్కడా రాజీపడకుండా వ్యవస్థల్ని ఢీకొట్టిన సాహసికుడాయన. తన వ్యాపార సామ్రాజ్య అస్తిత్వానికి పెను సవాళ్లు ఎదురైనప్పుడు కూడా అధికార కేంద్రాలకు దాసోహమనలేదు. పత్రికా స్వేచ్ఛ విషయంలో రామోజీరావుది తలవంచని తత్వం. దేశంలో పత్రికా స్వేచ్ఛకు ఎక్కడ ఆటంకం కలిగినా ఆయన ప్రతిఘటించారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఆయన పాత్ర ఎంతో క్రియాశీలం.
రామోజీరావు స్థాపించిన సంస్థల ద్వారా వేలమంది పాత్రికేయులు, వృత్తి నిపుణులు, రచయితలు, దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, గాయకులు, డ్యాన్సర్లు ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఈనాడు అత్యున్నత ప్రమాణాల వెనక ఆయన స్థాపించిన రామోజీ విజ్ఞాన కేంద్రం, ఈనాడు జర్నలిజం స్కూలు వంటి ఎన్నో విభాగాలున్నాయి.
హైదరాబాద్ నుంచే జాతీయ మీడియా : పలు భారతీయ భాషల్లో ఈటీవీ ఛానళ్లు స్థాపించి దశాబ్దాలుగా విజయవంతంగా నడపడం ఆయనకే చెల్లింది. ఆ వరుసలోనే ఆరేళ్ళ క్రితం 13 భాషల్లో 23 ఈటీవీ భారత్ న్యూస్ పోర్టళ్లను కూడా ప్రారంభించారు. రామోజీరావు పాత్రికేయంలోకి ప్రవేశించింది అన్నదాత పత్రిక ద్వారా.. ఈనాడు కంటే అయిదేళ్ల ముందే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుగువారికి చేర్చిన అన్నదాత- ఆయన రైతు కుటుంబ మూలాలను గుర్తుచేసే సెంటిమెంటు. భారతదేశంలోనే అత్యధిక సర్య్కులేషన్ కలిగిన వ్యవసాయ మాసపత్రికగా దశాబ్దాల పాటు అన్నదాత ఖ్యాతి పొందింది. ఈటీవీలో మార్గదర్శి ద్వారా వందలమంది మహనీయుల్ని ఆయన తెలుగు సమాజానికి పరిచయం చేసి స్ఫూర్తి నింపారు. ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ శ్రమదానం, సుజలాం సుఫలాం, ఈనాడు ముందడుగు కార్యక్రమాలను ఒక ఉద్యమంలాగా చేపట్టారు.
బాధితులకు అండగా : రామోజీ గ్రూపు సంస్థల ద్వారా సహాయ నిధి సమకూర్చి సామాన్య పాఠకుల, వీక్షకుల సహకారంతో దేశవ్యాప్తంగా ఎన్నెన్నో నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో భూకంపంలో ధ్వంసమైన కావ్డా అనే గ్రామాన్ని పునర్నిర్మించారు. కేరళలో భయానక వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. తమిళనాడులోని కడలూరు, నాగపట్టణాల్లో సునామీలో ఛిద్రమైన ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టించారు.
ఉమ్మడి ఏపీలో 1996 తుపానులో తీవ్రంగా దెబ్బతిన్న 50 గ్రామాల్లో సూర్యభవనాలు నిర్మించారు. ఇవి మాములు రోజుల్లో బడులుగా, విపత్తుల సమయంలో తుపాను షెల్టర్లుగా ఉపయోగపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర, హంద్రీ నది వరదల్లో దెబ్బతిన్న గ్రామాల్లో పక్కా స్కూలు భవనాలు నిర్మించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో చేనేత మగ్గాలు సమకూర్చి కోల్పోయిన ఉపాధిని తిరిగి కల్పించారు. ఒడిశా సూపర్ సైక్లోన్ బాధితులకు శాశ్వత ఆవాసాలు సమకూర్చారు.
దివిసీమ ఉప్పెన, విశాఖ హుద్‌హుద్ తుపాను బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. రామోజీరావు తన పుట్టిన ఊరు పెదపారుపూడినీ, రంగారెడ్డి జిల్లాలోని నాగన్‌పల్లినీ రామోజీ ఫౌండేషన్ తరఫున దత్తత తీసుకుని దాదాపు 28 కోట్ల రూపాయలతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ మండలాల్లో రూ.9 కోట్ల వ్యయంతో అయిదు ప్రభుత్వ భవనాలను నిర్మించి ఇచ్చారు. మంచిర్యాల, భద్రాచలం, కర్నూలులో రూ.5 కోట్ల వ్యయంతో వృద్ధాశ్రమాలు నిర్మించారు. కొవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 కోట్ల విరాళం అందించారు. తమిళనాడుకు రూ.కోటి అందజేశారు.
ఫిల్మ్‌సిటీ భారతీయ సినిమాలకు కేంద్ర బిందువు : రామోజీరావు మీడియా దిగ్గజంగానే కాదు సినీ నిర్మాతగా, స్టూడియో అధినేతగానూ ప్రసిద్ధులు. ఆయన తీసిన మయూరి, మౌన పోరాటం వంటి సందేశాత్మక సినిమాలు చరిత్ర సృష్టించాయి. ప్రతిఘటన, చిత్రం, నువ్వేకావాలి వంటి చిన్న బడ్జెట్ సినిమాలు వసూళ్లలో ఘన విజయం సాధించాయి. అతి పెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్‌లో నమోదైన రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి, గజిని, చంద్రముఖి, రోబో, పుష్ప, అత్తారింటికి దారేది, అరుంధతి, ఇంద్ర, సమరసింహారెడ్డి, మగధీర, శ్రీమంతుడు, హనుమాన్ సహా 3000లకు పైగా సినిమాలు జీవం పోసుకున్నాయి.
భారతీయ భాషా చిత్రాలతో పాటు 5 హాలీవుడ్ సినిమాలూ తెరకెక్కాయి. 160కి పైగా టీవీ సీరియళ్లు, 80కి పైగా వెబ్ సిరీస్‌లూ అక్కడ నిర్మాణమయ్యాయి. ఫిల్మ్‌సిటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నులు, సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.2500 కోట్ల వరకు ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచీ ఏటా దాదాపు 15 లక్షల మంది పర్యటకులు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడం భాగ్యనగరానికి ఒక వరం, ఒక గౌరవం.
ఇప్పటివరకు ఫిల్మ్ సిటీని సందర్శించిన వారి సంఖ్య 2.30 కోట్లకు పైమాటే! రామోజీరావు వినూత్న వ్యాపార శైలికి ప్రియా పచ్చళ్లు ఓ ఉదాహరణ. ఇళ్లలో అమ్మమ్మలు-నాయనమ్మలు పెట్టే పచ్చళ్లను కార్పొరేట్ వ్యాపారం స్థాయికి తీసుకెళ్లి అనేక దేశాలకు ఎగుమతి చేయడం ఆయన సృజనకు, దక్షతకు నిదర్శనం. రామోజీరావు తాను వెలుగుతూ ఇతరులకు వెలుగులు పంచారు. తన జీవిత కాలంలోనే ఒక లెజెండ్‌గా నిలిచారు. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుని తనతో పాటు మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆయన జన్మ ధన్యమైనది. సమకాలికులనే కాదు భావి తరాలనూ ఆయన ప్రభావితం చేస్తూనే ఉంటారు.
అమ్మ భాషకు వందనం : తెలుగు భాషను అపారంగా ప్రేమించి, పోషించిన వ్యక్తి రామోజీరావు. రూపాయి పావలా ధరతో చతుర, విపుల మాస పత్రికలు ప్రారంభించి విశ్వ కథా, నవలా సాహిత్యాన్ని తెలుగువారికి అందించారు. తెలుగు వెలుగు, బాలభారతం పత్రికల ద్వారా భాషా సేవ చేశారు. ఈటీవీ ద్వారానూ తెలుగు వెలుగులు నింపారు. సుసంపన్నమైన తెలుగు భాష వాడి పోకుండా, సంకరం కాకుండా జీవితాంతం పాటు పడ్డారు. ఈనాడు వ్యవహార పదకోశం, ఈనాడు భాషా స్వరూపం ప్రచురించి ప్రామాణిక భాష రూపకల్పనకు కృషిచేశారు. సమగ్రమైన ఆధునిక తెలుగు నిఘంటువుల నిర్మాణం ఆయన కల. భాషా నిపుణులతో కూడిన ఒక బృందం కొన్ని సంవత్సరాలుగా ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది.
రామోజీరావు విలువలూ విశ్వాసాలు
- ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించు. నిన్నటి వైపు తొంగిచూడకు.
- మార్పు ప్రగతి రెండూ కవల పిల్లలు. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి కోరుకుంటే కొత్తగా ఆలోచించు.
- ఎదగడానికి ఆకాశమే హద్దు. ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలే చెయ్యి. ఫలితాలూ అలాగే ఉంటాయి.
- ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ బతుకు నువ్వే బతుకు. ఎవరి సాయం కోసమూ ఎదురు చూడకు.
- ఇతరుల చప్పట్ల కోసం కాదు, నీ అంతరాత్మను మెప్పించే పనులే చెయ్యి. విజయాలతో పాటు అంతులేని సంతృప్తీ నీ సొంతమవుతుంది.
- సవాళ్లకు ఎప్పుడూ భయపడకు. అవి కష్టాలనే కాదు.. అవకాశాలనూ మోసుకొస్తాయి.
- నీ ఆత్మాభిమానం కంటే ఏదీ విలువైంది కాదు. కష్టాలొచ్చాయని నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరితోనూ, దేనితోనూ రాజీపడకు.
- ఆర్థికంగా మనజాలనిది ఏదైనా కాలగర్భంలో కలిసి పోతుంది. ఏ కొత్త పని మొదలుపెట్టినా దీన్ని గుర్తుపెట్టుకో.
- క్రమశిక్షణకు మించిన విజయ రహస్యం మరొకటి ఉండదు. అది లేనప్పుడు ఏ ప్రతిభా రాణించదు.
- వ్యక్తికైనా, వ్యవస్థకైనా నిజమైన సంపద విశ్వసనీయతే. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకో!
- ప్రజల చేతిలో అస్త్రమైనప్పుడే పత్రికకు విలువ. ప్రజలే తన చేతుల్లో ఉన్నారని పత్రిక భావిస్తే ఆత్మహత్యా సదృశమే
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విజయవాడలో రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా) - రచయిత ఎం. నాగేశ్వర రావు - ఎడిటర్, ఈనాడు ఆంధ్రప్రదేశ్