Pratidwani : మంట పుట్టిస్తున్న ధరల కట్టడి దిశగా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1 నుంచే రోజూ టోకు, చిల్లర ధరలకు సంబంధించి నిఘా ఉంచే నిత్యావసర ఆహార ఉత్పత్తుల సంఖ్యను గణనీయంగా పెంచింది. అవసరమైనప్పుడు ధరల స్థిరీకరణకు జోక్యం చేసుకుంటామనీ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు.
ఇప్పటికే సమీక్షిస్తున్న 22.. కొత్తగా చేర్చిన 16 కలపి.. 38 ఆహార సరకులపై కేంద్రం కన్నేసి ఉంచనుంది. మరి ఈ లిస్ట్‌లో ఉన్న వస్తువులేంటి? వీటి ధరలకు సంబంధించి నిఘాతో పాటు కేంద్రం ఇకపై ఏం చేయబోతోంది? ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వ చర్యలపై నిపుణులు, వ్యవసాయ, పౌర సమాజం ప్రతినిధులు ఏం అనుకుంటున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. నేటి చర్చలో విజయవాడకు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జె. కుమారస్వామి, ఐఐఐటీ హైదరాబాద్ ప్రతినిధి ప్రొ. పి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నిత్యావసర ధరలు అదుపులో లేకపోతే కోట్లాది ప్రజల జీవితం దుర్భరం అవుతుంది. అదే సమయంలో వాటిని పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వారు సంక్షోభంలో పడతారు. పంట అమ్ముకుందామన్న రైతులేమో ధరల్లేక, కొందామనుకునే ప్రజలేమో వాటిని భరించలేక అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరి కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలపై నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ధరల స్థిరీకరణ కోసం 10వేల కోట్ల రూపాయల వరకు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరల నియంత్రణ అనేకాంశాలతో ముడిపడి ఉంటుంది. దానిలో ధరలపై నిఘా మొదటి అడుగు. దీనికి అదనంగా ఇంకా ఏమేం చేయాలి?. అవసరాలు, నిల్వలు, మార్కెట్ వ్యవస్థకు సంబంధించి సమగ్ర సమాచార నిర్వహణకు డేటా సైన్స్ వంటి సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయి?. ప్రభుత్వం వాటిని వాడుకుంటోందా? ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా కనిపిస్తున్నాయి? అనే అంశాలపై నిపుణులు చర్చించారు.