Pratidhwani : హైదరాబాద్‌లో ఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. చిక్కిపోతున్న చెరువులకు చిరు దీపంలా కొత్త ఊపిరులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఒత్తిడులకు లొంగకుండా, చెరువులు, కుంటల్ని చెర విడిపించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఆక్రమణల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. కొద్దిపాటి సిబ్బంది, అంతంతమాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది. ప్రగతినగర్ ఎర్రకుంట, మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో భారీ నిర్మాణాలు నేలకూల్చేదాక పట్టువీడటం లేదు. ఇప్పుడు ఈ ఆక్రమణల తొలగింపు కోసం ఆ విభాగం దూకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అసలు చెరువుల పరిస్థితేంటి? : ఒకప్పుడు చరిత్రకు సాక్ష్యంగా, ప్రజల జీవనోపాధికి అండగా నిలిచిన చెరువుల్ని ఇకనైనా కాపాడుకోవడానికి మాకూ ఓ హైడ్రా తరహా విభాగం కావాలంటూ పౌర సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. చెరువులు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మరి హైదరాబాద్ జంట నగరాల్లో అసలు చెరువుల పరిస్థితేంటి? ఒకప్పుడు చెరువుల నగరంగా ఉన్న భాగ్యనగరంలో ఇప్పుడెన్ని మిగిలాయి? ఏ పరిస్థితుల్లో ఉన్నాయి?
HYDRA Need in AP : అసలు రాష్ట్రం, ప్రాంతం ఏదైనా చెరువులు, నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? అవి మనకు ఎందుకు అవసరం? తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయో నిగ్గు తేల్చడం వాటి ఎఫ్‌టీఎల్ పరిధిలు నిర్ణయించి నోటిఫై చేయాలన్న హైకోర్టు అమలు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న చెరువుల స్థితిగతులు, వాటి ఆక్రమణలు, అదృశ్యంపై సమగ్ర అధ్యయనం ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడైనా జరగాల్సిన కార్యాచరణ ఏమిటి?
ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువుల పూర్తిస్థాయి పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది? ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో పాటు అసలు రెండు రాష్ట్రాల్లోని చెరువులు, వాగులు, కుంటల పరిస్థితేంటి? ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాల్సి ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ.టి.శ్రీకుమార్, సామాజిక ఉద్యమకారిణి లుబ్నా సార్వత్ పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.
ఏపీలోనూ హైడ్రా? అక్రమ నిర్మాణాలను సహించం- మంత్రి నారాయణ - Hydra Demolition in AP