Prathidwani on Offences in Social Media : సామాజిక మాధ్యమ వేదికలు నేడు ప్రజల రోజువారీ జీవితాల్లో విడదీయలేనతంగా భాగం అయ్యాయి. నెటిజన్లు తమ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో జరిగే ప్రతీ సందర్భాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలపై పంచుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఉన్మాదులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్‌లోని ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను అనైతిక పద్ధతుల్లో వక్రీకరిస్తున్నారు. ఫలితంగా చిన్న, పెద్ద తేడా లేకుండా రోజూ అసంఖ్యాకంగా జనం వేధింపులకు, అవమానాలకు గురవుతున్నారు. ఇలా డిజిటల్ వేదికలపై అకృత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటి వల్ల మహిళలు, చిన్నారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది? డిజిటల్ దుర్మార్గులకు బీఎన్ఎస్ వంటి కొత్త నేరన్యాయ చట్టాల ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి? ఇదే నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సామాజిక విశ్లేషకులు ఎం. బాలలత, హైకోర్టు న్యాయవాది కట్టా శ్రావ్య పాల్గొన్నారు.
YouTuber Praneeth Hanumanthu was Arrested : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ హనుమంతును సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులకు చిక్కాడు. తండ్రీ కుమార్తెల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. ఓ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిదుర్గ తేజ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు.
ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతోపాటు మరి కొందరికి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపర్చారు.
తండ్రి కుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని అభియోగంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న మరి కొంత మంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రణీత్‌ను బెంగళూరు నుంచి పోలీసులు తెలంగాణలోని హైదరాబాద్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.