Broccoli Breakfast Recipe to Reduce Wight : మారిన జీవన శైలి కారణంగా.. బరువు పెరగడం కామన్ అయ్యింది. దీంతో.. బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ తగ్గించడం వంటివి చేస్తుంటారు చాలా మంది. అయితే వెయిట్ లాస్ అయ్యేందుకు బ్రోకలీతో తయారు చేసిన ఈ రెసిపీని బ్రేక్‌ఫాస్ట్‌గా ట్రై చేయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే ఆ రోజంతా తక్కువ ఆహారాన్ని తినే అవకాశం ఉంటుందని.. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చంటున్నారు. బ్రోకలీలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పైగా ఈ రెసిపీని కేవలం అతి తక్కువ పదార్థాలతో.. పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- బ్రోకలీ - పావు కిలో
- వెల్లుల్లి రెబ్బలు - మూడు
- మిరియాల పొడి - పావు టీ స్పూను
- వేరుశనగలు - గుప్పెడు
- చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆలివ్ నూనె - రెండు టీ స్పూన్లు
తయారీ విధానం:
- బ్రోకలీని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్‌ను కూడా తీసుకోవాలి.
- వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాలి. వేరుశనగలను ఒకసారి దోరగా వేయించి రెడీగా పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆలివ్ నూనె వేయాలి.
- నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
- ఆ తర్వాత బ్రోకలీని, పల్లీలు వేసి వేయించాలి. ఆ పైన తరిగిన చిల్లీ ఫ్లేక్స్‌ను వేసుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కూడా కలిపి ఈ మొత్తాన్ని ఐదు నిమిషాలపాటు చిన్న మంట మీద వేయించుకోవాలి.
- అంతే.. టేస్టీ అండ్ సింపుల్ బ్రోకలీ బ్రేక్ ఫాస్ట్ రెడీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి? : బ్రోకలీ.. విటమిన్ సి, కె, ఫోలేట్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది తక్కువ కేలరీలనూ కలిగి ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతి కలుగుతుందని, తద్వారా తక్కువ తిని బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అలాగే.. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయని చెబుతున్నారు.
2018లో "జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బ్రోకలీ సప్లిమెంటేషన్.. అధిక బరువు/ఊబకాయం ఉన్న పెద్దలలో శరీర కొవ్వు శాతం, నడుము చుట్టుకొలతలో గణనీయమైన తగ్గింపులకు దారితీసిందని కనుగొన్నారు. ఇదే విషయాన్ని NIH సభ్యుల బృందం కూడా స్పష్టం చేసింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆరోగ్యాన్నిచ్చే "ఓట్స్ పొంగల్" - చిటికెలో చేసుకోండిలా! - బరువు తగ్గాలనుకునేవారికి బెటర్ ఆప్షన్!
వ్యాయామం లేకుండా బరువు తగ్గాలా? - మీరు తినే ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలట!