Pumpkin Seeds Health Benefits : గుమ్మడికాయను కర్రీ, సాంబార్లో వేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చాలా మందికి తెలుసు. అయితే.. గుమ్మడికాయతోనే కాకుండా.. గుమ్మడి గింజల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కుగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మగవారిలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్యఔషధంలా పని చేస్తాయని అంటున్నారు. గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గుండెకి మేలు:
గుమ్మడి గింజల్లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, పొటాషియం, పాస్పరస్, విటమిన్ ఎ, బి, సి, డి, బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది.
కిడ్నీలు ఆరోగ్యంగా:
గుమ్మడి విత్తనాలలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరు బాగుంటుంది. వీటిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
ప్రొస్టేట్ గ్రంథి వాపుని అడ్డుకుంటుంది!
వయసు పైబడిన మగవారిలో తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం వెనుక షుగర్ జబ్బుతోపాటు ప్రొస్టేట్ గ్రంధి పెరుగుదల కూడా ఓ కారణమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది కొంతమందిలో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల ప్రొస్టేట్ గ్రంధి వాపు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
2014లో "జర్మన్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఆన్ నేచురల్ యూరాలజికల్స్" (GRANU) గుమ్మడి గింజలకు సంబంధించి ఒక పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో 1,431 మంది పురుషులకు (50-80 సంవత్సరాలు) గుమ్మడి గింజలను ఇచ్చారు. గుమ్మడి గింజలు తిన్న పురుషులలో ప్రొస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో జర్మనీలోని కుర్‌పార్క్ హాస్పిటల్‌కు చెందిన 'డాక్టర్ విన్‌ఫ్రైడ్ వాహ్లెన్సీక్' పాల్గొన్నారు.
వెయిట్ లాస్ :
బరువు తగ్గాలనుకునేవారికి గుమ్మడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని టేబుల్‌స్పూన్ తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉండవచ్చు. అలాగే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
- ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల టెన్షన్ తగ్గుతుంది.
- అలాగే మధుమేహం ఉన్నవారు డైలీ స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చు.
- గుమ్మడి గింజలు తినడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఫలితంగా రాత్రి కంటినిండా నిద్రపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
గుమ్మడి గింజలు అందరూ తినాలా? - తింటే ఏం జరుగుతుంది?
బరువు తగ్గాలా?.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలా?.. అయితే ఈ గింజల్ని ట్రై చేయండి!