Pesara Garelu Recipe in Telugu : మనలో చాలా మందికి వేడివేడి గారెలంటే చాలా ఇష్టం. ఇంట్లో పండగలైనా, శుభకార్యాలైనా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా.. కరకరలాడే గారెలు చేసుకుని తింటుంటాం. అయితే, దాదాపు అందరూ మినప్పప్పు, అలసందలతో టేస్టీ గారెలు చేస్తుంటారు. ఇవన్నీ క్రిస్పీగా రుచిగా ఉండేవే. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా పెసర గారెలు చేసుకోండి.. రుచి అద్దిరిపోతుంది. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే గారెలు నూనె ఎక్కువ పీల్చకుండా ఎంతో రుచికరంగా వస్తాయి. పిల్లలు ఈ పెసర గారెలను ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా పెసర గారెలను ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
పెసర గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయ - 1
- పెసలు-కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - 1 టీ స్పూన్
- నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
- అల్లం తరుగు -టీ స్పూన్
- పచ్చిమిర్చి-5
- కరివేపాకు-1
పెసర గారెలు తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి పెసలు వేసి.. నీళ్లతో శుభ్రంగా కడగాలి. తర్వాత మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
- అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి.
- అవి బాగా నానిన తర్వాత మరోసారి బాగా కడిగి నీళ్లు లేకుండా జల్లెడలో వేసుకోవాలి.
- తర్వాత నానిన పెసలలో నుంచి గుప్పెడు తీసుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి పక్కన ఉంచిన పెసలు వేసి చేతితో మెదుపుకోండి.
- ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిర్చి పేస్ట్‌ని పెసల మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.(గారెలు క్రిస్పీగా రావాలంటే పిండి కాస్త గట్టిగానే ఉండాలి.)
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండిని గారెల మాదిరిగా చేసుకోవాలి.
- వాటిని కాగిన నూనెలో వేసి నిమిషం పాటు వదిలేయాలి.
- ఇప్పుడు స్టవ్‌ని మీడియంలో పెట్టి రెండు వైపులా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గారెలుగా రెడీ చేసుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే పెసర గారెలు రెడీ. వీటిని వేడివేడిగా ఓ కప్పు చాయ్‌తో కలిపి తీసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. చికెన్ సూప్‌లో ముంచుకుని తింటే మరింత కిక్ వస్తుంది.
- నచ్చితే ఈ విధంగా పెసర గారెలు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్ "స్పైసీ ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి!
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే "బ్రెడ్ రోల్స్" - ఈ స్టైల్లో చేస్తే ఒక్కటి కూడా విడిచి పెట్టరు!