How To Make Bellam Kudumulu : గణనాథుడికి ఆవిరి కుడుములు అంటే ఎంతో ఇష్టం. అందుకే.. వినాయక చవితి రోజున ప్రతి ఇంట్లో తప్పకుండా కుడుములు చేసి నైవేద్యంగా ఆ గణపతికి సమర్పిస్తారు. ఈ ఆవిరి కుడుములలో చాలా రకాలుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోస్టైల్లో వీటిని తయారు చేస్తుంటారు. అయితే.. బెల్లం, విస్తరాకులతో చేసే కుడుములను స్వామి ఇష్టంగా స్వీకరిస్తాడని చెబుతారు. మరి.. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
బెల్లం కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బెల్లం - 1 కప్పు
- తడి బియ్యపుపిండి - కప్పు
- పచ్చి కొబ్బరి-2 టేబుల్స్పూన్లు
- యాలకులపొడి-టీస్పూన్
- పచ్చి శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- నీళ్లు - 2 కప్పులు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి నీళ్లలో పచ్చి శనగపప్పు వేసి మెత్తగా ఉడికించుకోండి.
- ఇందులోకి తరిగిన బెల్లం వేసుకుని కరిగించుకోండి.
- తర్వాత కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి పాకం చిక్కగా మారేంత వరకు ఉండండి.
- ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి వేసి ముద్దగా మారేంత వరకు కలుపుకోండి.
- పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కుడుములు చేసుకోండి.
- వీటిని ఆవిరికి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
- గణపతికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు రెడీ.
విస్తరాకు కుడుములు (Vistaraku Kudumulu):
కావాల్సిన పదార్థాలు :
- బెల్లం - 1 కప్పు
- నీళ్లు- కప్పున్నర
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- సోంపు- అరటీస్పూన్
- యాలకుల పొడి - 2 టేబుల్ స్పూన్లు
- సన్నని పచ్చికొబ్బరి ముక్కలు - పావుకప్పు
- శొంఠి-టీస్పూన్
- విస్తరాకులు-10
- తడి బియ్యపుపిండి - 1 కప్పు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి అందులో నీళ్లు పోయండి. ఇందులో బెల్లం వేసి కరిగించి పక్కన పెట్టుకోండి.
- మరొక పాన్లో నెయ్యి వేసి అందులో సోంపు, కొబ్బరి ముక్కలు వేసి నిమిషం వేయించండి.
- తర్వాత పాన్లో కరిగించిన బెల్లం పాకం జాలీ సాయంతో వడకట్టండి.
- ఇందులోకి యాలకుల పొడి, శొంఠి వేసుకుని బాగా మరిగించండి. తర్వాత బియ్యం పిండి వేసి కలపండి.
- పిండి ముద్దగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యిరాసుకుని కుడుములు చేసుకుని పక్కన పెట్టుకోండి.
- అరగంటపాటు నీటిలో నానబెట్టిన విస్తరాకులో చేసిన కుడుములను చేర్చి పుల్లతో ఆకులను గుచ్చండి.
- ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి అందులో విస్తరాకు కుడుములను ఆవిరికి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా చేస్తే విస్తరాకు కుడుములు రెడీ.
ఇవి కూడా చదవండి :
బొజ్జ గణపయ్యకు "ఉండ్రాళ్ల పాయసం" - ఇలా చేసి పెడితే వినాయకుడు ఎంతో ఆనందిస్తాడు!