Brain Dead Woman Organs Donation in Anakapalli Dist : కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని వింటూనే ఉంటాం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి అవి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు తమవారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
Organ Donation in Anakapalli District : తాజాగా పుట్టెడు దుఃఖంలోనూ ఉన్న ఓ కుటుంబం ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందుకు వచ్చింది. పేదలైనా అక్షర జ్ఞానం లేకపోయినా పెద్ద మనసు చేసుకొని అవయవదానానికి అంగీకరించింది. కనుచూపు మేరలో కన్నతల్లి కనిపించదని తెలిసినా ఇతరుల నీడలో ఓదార్పు పొందడానికి సిద్ధమయ్యారు. కష్టకాలంలో గొప్ప మనసు చాటుకున్న సంఘటన అనకాపల్లిలో జిల్లాలో జరిగింది.
స్పూర్తిగా నిలిచిన కుటుంబ సభ్యులు : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడకకు చెందిన ఓ మత్స్యకార మహిళ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అంత కష్టంలోనే కుటుంబ సభ్యులు బాధను దిగమింగుకొని వారు అవయవదానానికి ముందుకు వచ్చారు. తద్వారా ఏడుగురికి అవయవ దానం చేసి ఆ కుటుంబ సభ్యులు స్ఫూర్తిగా నిలిచారు.
Pudimadaka Woman Organs Donate : పూడిమడకకు చెందిన యజ్జల అడివారం (30) ఈ నెల 3న రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద అధిక రక్తపోటుకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన పిల్లలు తల్లిని బతికించుకోవాలనే ఆశతో షీలానగర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె బ్రెయిన్‌లో నరాలు చిట్లిపోవడంతో సాధ్యంకాలేదు. ఈ క్రమంలోనే ఆమె బ్రెయిన్‌డెడ్ అయిన్నట్లు ఈ నెల 5న వైద్యులు తేల్చేశారు. ఈమేరకు అడివారం భర్త ముత్యాలు, పిల్లలు తాతారావు, రాజేశ్వరి, మేరుగు అప్పలనాయుడుకు తెలిపారు.
అయితే అవయవదానం చేయొచ్చని అడివారం కుటుంబసభ్యులకు వైద్యులు అవగాహన కల్పించారు. ఇంత విషాదంలోనూ దుఃఖాన్ని అదిమిపట్టి వైద్యులు చెప్పినట్లు అవయవాలు దానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. మత్స్యకార గ్రామంలో పుట్టిపెరిగిన వారికి అవయవదానంపై అవగాహన లేకపోయినా చెప్పిన వెంటనే సరే అనడంతో వైద్యులు సైతం సంతోషించి వారిని అభినందించారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు కాలేయం, గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులను వేరుచేసే ప్రక్రియను విజయవంతంగా ముగించారు. ఆమె మరణించినా ఏడుగురికి జీవితాన్ని ప్రసాదించిన మత్స్యకార మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి అధికారిక లాంఛనాలతో అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
కన్నీటి మధ్య అంత్యక్రియలు : గ్రామానికి చెందిన యువకులు, ప్రజలు, మహిళలు పూలమాలవేసి ర్యాలీగా అడివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆమె త్యాగాన్ని గుర్తించిన వందలాది మంది గ్రామస్థులు శ్మశానం వరకు జేజేలు పలికారు. మృతదేహం పూడిమడక చేరగానే గ్రామస్థులు, కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. వేలాదిమంది శ్మశానానికి నడిచిరాగా అడివారం అంత్యక్రియలను కన్నీటి మధ్య నిర్వహించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి : కుటుంబానికి అన్నీతానై ఇద్దరు పిల్లలను సాకుతూ మృతిచెందిన అడివారం కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ మత్స్యకార నాయకుడు మేరుగు అప్పలనాయుడు కోరారు. వారికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అవయవదానం చేసిన కుటుంబానికి సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు. మత్స్యకార మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరోవైపు అడివారం మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు తల్లి లేనివారు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన మహిళ - Brain Dead Woman Organs Donate
Organ Donation in VIMS: జీవన్మృతుడిగా యువకుడు.. చనిపోతూ మరో ఐదుగురికి వెలుగులు