Teacher Wedding Invitation : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు పెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ప్రశ్నాపత్రంలా తయారు చేయించారు. ప.గో. జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ప్రత్యూష విశాఖ పైడా ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అక్కడే పరిచయమైన విశాఖపట్నానికి చెందిన ఫణీంద్రతో ఆమె వివాహం నిశ్చయమైంది. ఇంకేముంది! సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించి బంధుమిత్రులకు ఒకింత షాక్ ఇచ్చింది
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ, పెళ్లి ఘట్టంలోకి తొంగి చూస్తే ప్రతీదీ వింతే. పెళ్లి కార్డు మొదలుకుని దుస్తులు, ఏర్పాట్లు, విందు భోజనాల వరకూ అంతా ప్రత్యేకమే. వివాహ ఘట్టాన్ని మర్చిపోని జ్ఞాపకంలా జరుపుకోవాలని ఎంతో మంది ఆశిస్తుంటారు. ఎవరికి వారు ప్రత్యేకంగా ఆలోచిస్తూ బంధుమిత్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. శుభలేఖ ఎంపిక విషయంలో ఇప్పటికే ఎంతో మంది విభిన్న కోణాల్లో ఆలోచించి ముద్రించినా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు రూపొందించిన పెళ్లికార్డు బంధుమిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఉపాధ్యాయురాలు నార్కెడమిల్లి ప్రత్యూష వివాహం ఈ నెల 23న ఫణీంద్రతో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యూష తన వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. రోటీన్‌కు భిన్నంగా విద్యార్థుల ప్రశ్నాపత్రం మాదిరిగా రూపొందించి ఆహ్వానితులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ప్రశ్నాపత్రాన్ని తలపించే ఈ శుభలేఖలో ప్రధానంగా 8 ప్రశ్నలు సంధించారు. ముందుగా ఈ వ్యక్తిని గుర్తుపట్టండి అంటూ వరుడి ఫొటోతో ముద్రించారు. ఆ తర్వాత సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ ఛాయిస్ అంటూ 8 ప్రశ్నలు ఇచ్చారు. వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు జత చేశారు. పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన ప్రశ్నలతో నింపేశారు.
రెండో ప్రశ్నగా వధువు పేరును (కరెక్ట్ స్పెల్లింగ్) ఆప్షన్ కింద ఇచ్చారు. మూడు, నాలుగు ప్రశ్నలు కన్యాదాతల (పెళ్లి కూతురు తల్లిదండ్రులు) పేర్లు, వరుడి తల్లిదండ్రుల పేర్లు తెలియజేసేలా, ఐదో ప్రశ్న వివాహ తేదీ, ముహూర్తం వివరాలు ఆప్షన్ల కింద ఇచ్చారు. ఏడో ప్రశ్నలో వేదిక వివరాలు చివరగా విందుకు సంబంధించిన ప్రశ్నతో ముగించారు.
ఉపాధ్యాయురాలు తన వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను వినూత్నంగా డిజైన్ చేయించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
టాబ్లెట్ షీట్‌పై వెడ్డింగ్ కార్డు, క్రియేటివిటీ అదుర్స్ కదా
'ఆశీర్వాదాలే మీ పెట్టుబడి'.. 'స్టాక్ మార్కెట్' వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్.. మీరూ చూసేయండి