US Citizenship Indian : అమెరికాలో 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా నిలిచింది భారత్. 59,000 మందికి పైగా భారతీయులు గతేడాదిలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఈ జాబితాలో మెక్సికో తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్) వార్షిక నివేదిక తెలిపింది. దీని ప్రకారం సెప్టెంబర్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8.7లక్షల మంది అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇందులో 1.1లక్షల మంది మెక్సికో పౌరులు ఉండగా, 59,100తో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 44,800 మందితో ఫిలిప్పీన్స్, 35,200తో డొమినికన్ రిపబ్లిక్ ఉంది. అంతకుముందు ఏడాది కూడా తొలి రెండు స్థానాల్లో మెక్సికో, భారత్ ఉన్నాయి.
అయితే, అమెరికా పౌరసత్వం దక్కాలంటే అనేక నిబంధనలు (america citizenship process) ఉంటాయి. అమెరికా వలస, జాతీయ చట్టం ప్రకారం అర్హత ఉన్నవారికే కేటాయిస్తారు. సుమారు ఐదేళ్ల పాటు అమెరికాలో చట్టబద్ధంగా నివాసం ఉండాలి. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, సైనిక సేవలో ఉన్నవారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. 2023లో పౌరసత్వం పొందిన వారిలో అత్యధికులు ఐదేళ్ల చట్టబద్ధ నివాసం నిబంధన కిందే దరఖాస్తు చేసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
12ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు 16,63,440
గత 12ఏళ్లలో 16,63,440 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ అంతకుముందు తెలిపింది. 2014 నుంచి 2022 మధ్యకాలంలో 2,46,580 మంది భారతీయులు పాస్‌పోర్టులను సరెండర్ చేశారని కేంద్ర సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. వీరిలో ఏపీకి చెందినవారు 9,235, తెలంగాణ వారు 7,256 మంది ఉన్నారని మంత్రి చెప్పారు. అయితే, కేవలం 2022లోనే సుమారు 2.25లక్షల మంది పౌరసత్వాన్ని త్యజించినట్లు కేంద్రం చెప్పింది. ఒకే ఏడాదిలో ఇంతమంది పౌరసత్వాన్ని వదులుకోవడం ఇదే తొలిసారి. 2015లో 1.31లక్షలు, 2016లో 1.41లక్షలు, 2017లో 1.33లక్షలు, 2018లో 1.34లక్షలు, 2019లో 1.44లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది. 2020లో అతి తక్కువగా 85వేల మంది తమ సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నారని వివరించింది. కాగా 2021లో 1.63లక్షల మంది పౌరసత్వాన్ని విడిచిపెట్టారని పేర్కొంది.
11 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న 16లక్షల మంది భారతీయులు.. 2022లో 2లక్షలకుపైగా