PM Modi UAE Visit 2024 : యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాలు విస్తరణపై చర్చించుకున్నారు. వీరిద్దరి సమక్షంలో ఇరు ప్రభుత్వాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ మీటింగ్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తదితరులు పాల్గొన్నారు.
UPI రూపే కార్డు సేవలు ప్రారంభం
UAE అధ్యక్షుడుతో కలిసి ప్రధాని మోదీ ఆ దేశంలో UPI రూపే కార్డు సేవలను ప్రారంభించారు. అక్కడి స్థానిక కార్డు అయిన జయవాన్ కార్డ్‌తో భారత్ రూపే కార్డును లింక్ చేశారు. అబుదబీలో రూపే జయవాన్ కార్డుల సేవలు ప్రారంభం సందర్భంగా తన పేరుతో ఉన్న కార్డును యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్ స్వైప్ చేశారు.
'సోదరా, ఘన స్వాగతానికి కృతజ్ఞతలు'
అంతకుముందు రెండు రోజుల పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల అధినేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ యూఏఈ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2015 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ ఏడుసార్లు యూఏఈలో పర్యటించారు.
ఇదే విషయాన్ని ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'నాకు సాదర స్వాగతం పలికిన సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఏడు నెలల్లో మేము ఐదుసార్లు కలుసుకున్నాం. ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడకు ఏడు సార్లు వచ్చే అవకాశం వచ్చింది. మేం ప్రతి రంగంలో ఎలా అభివృద్ధి సాధించామో, అక్కడ భారత్, యూఏఈ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఉంది' అని మోదీ అన్నారు. అంతకుముందు, 'సమయం వెచ్చించి మరీ నన్ను రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఇంటికి, నా కుటుంబాన్ని కలిసినట్టు అనిపిస్తుంది' అని ట్వీట్ చేశారు.
'భారత్‌తో మీకున్న అనుబంధానికి అదే నిదర్శనం'
యూఏఈలో బాప్స్ మందిరం ఉండటం భారత్‌పై మీకున్న (యూఏఈ అధ్యక్షుడు) అనుబంధానికి నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. యూఏఈ నాయకత్వం మద్దతు లేకుండా అబుదాబిలో ఆ ఆలయ నిర్మాణం సాధ్యమయ్యేది కాదని ఆయన చెప్పారు.
'మోదీ కృషి వల్లే ఇలాంటి రోజు సాకారమైంది'
'అహ్లాన్ మోదీ' పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడనున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహంగా కనిపించారు. యూఏఈ పర్యటనలో భాగంగా మోదీ బస చేసే హోటల్ వద్దకు చేరుకుని 'అహ్లాన్ మోదీ', 'మోదీ హై తో ముమ్కిన్ హై' అంటూ నినాదాలు చేశారు. తామంతా మోదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఓ ప్రవాస భారతీయురాలు ప్రియాంక బిర్లా అన్నారు. చారిత్రక బాప్స్ మందిర ప్రారంభోత్సవంలో తామంతా భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. ప్రధాని చేసిన కృషి వల్లే యూఏఈలో ఇలాంటి రోజు సాకారమైందని చెప్పారు.
ఫిబ్రవరి 14న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఖతార్ దేశానికి వెళ్లనున్నారు.
20వేల టన్నుల రాతి, నాలుగేళ్ల శ్రమ- వెయ్యేళ్లు నిలిచేలా యూఏఈలో అతిపెద్ద హిందూ ఆలయం!
మూడేళ్లు నవాజ్- రెండేళ్లు భుట్టో- పాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం!