Israel Hamas War : ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లపై యుద్ధం వంద రోజులు దాటిపోయినా, ఇంకా బందీలుగా ఉన్న తమ దేశీయులను విడిపించుకోవడంలో సఫలం కాలేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. అంతేకాకుండా తాము అనుసరిస్తున్న వ్యూహాలు సరైనవేనా అనే సందేహాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలంటూ తాము చేసిన సూచనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తిరస్కరించడంపై దాని మిత్ర దేశం అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం ద్వారానే వారి వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకోగలమని ఇజ్రాయెల్ మాజీ సైనికాధిపతి గాడి ఐసెన్‌కోట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతరత్రా ఏ పద్ధతిలోనైనా బందీలను విడిపించుకోగలమని చెప్పడం భ్రమలు కల్పించడమేనని అన్నారు.
25వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్ వార్ కేబినెట్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరైన ఐసెన్‌కోట్, హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇలాంటి బహిరంగ ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన మారణహోమంలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మరో 250 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు పట్టుకుపోయారు. అందులో 130 మందికిపైగా ఇప్పటికీ హమాస్ చెరలోనే ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అయితే, బందీలంతా జీవించే ఉన్నారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గాజా మొత్తం దాదాపు ధ్వంసమైంది. 25వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం కొనసాగించడంపై స్వదేశంలోని విపక్షంతో పాటు మిత్ర దేశమైన అమెరికా నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వార్ కేబినెట్‌లో కొనసాగడంలోని ఔచిత్యాన్ని తాను నిత్యం ప్రశ్నించుకుంటున్నానని ఐసెన్‌కోట్ తెలపటం గమనార్హం. తాము ఇంకా వ్యూహాత్మక విజయాలను సాధించలేదని, హమాస్ మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించలేదని ఆయన చెప్పారు.
స్వతంత్ర పాలస్తీనాకు ఇజ్రాయెల్ ప్రధాని నో
గాజాపై ఇజ్రాయెల్ దాడి తీవ్రతను తగ్గించి, యుద్ధం తర్వాత ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం సూచించారు. అయినా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అనంతంరం బైడెన్ సర్కారు నెతన్యాహు ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. స్వతంత్ర పాలస్తీనా తమపై దాడులకు స్థావరంగా మారుతుందని బెంజమిన్ నెతన్యాహు భావిస్తున్నారు.
గాజా యుద్ధానికి 100 రోజులు- అట్టుడుకుతున్న పశ్చిమాసియా!- అందోళనలో ప్రపంచ దేశాలు!
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా, ఇస్లామిక్ గ్రూప్ ప్రతీకార దాడులు- 122 మంది మృతి!