India Rejects Canada Allegations : కెనడాలో భారత దౌత్యవేత్తలకు క్రిమినల్ గ్యాంగ్‌లతో లింక్ పెడుతూ ఆ దేశం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కు అతివాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు ఆధారాలు సమర్పించినట్లు కెనడా చేసిన ఆరోపణలను కూడా భారత్ మంగళవారం తోసిపుచ్చింది. కెనడియన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్ రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తిరస్కరించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెనడా ప్రధాని ట్రూడో మళ్లీ పాత పాటే పాడినట్లు విమర్శించింది. అదే పాత ట్రూడో, అదే పాత కారణాలతో, అదే పాత విషయాలను చెప్పారని ఎద్దేవా చేసింది.
'అందులో నిజం లేదు'
నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు నమ్మదగ్గ సాక్ష్యాలను ఇచ్చినట్లు కెనడా చేసిన వ్యాఖ్యల్లో అసలే మాత్రం నిజం లేదని పేర్కొంది. అస్పష్టమైన ఆరోపణలు చేయడం, వాటిని తిరస్కరించే భారాన్ని భారత్‌పై మోపడం మొదట నుంచి కెనడాకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేసింది.
'ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు'
భారత ఏజెంట్లకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ చేసిన ఆరోపణలను భారత్ తిరస్కరించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా తమకు సమర్పించలేదని తెలిపింది. కొందరిని జవాబుదారీ చేయాలని కెనడా చెబుతున్నా, ఎవరిని చేయాలి? ఎందుకోసం చేయాలి? అనేదానిపై స్పష్టత ఇవ్వడం లేదని వివరించింది. ఒట్టావాలోని భారత హైకమిషనర్‌ను కెనడా టార్గెట్ చేయడంపై కూడా భారత వర్గాలు తీవ్రంగా స్పందించాయి. గతేడాది కాలంగా ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఇప్పుడు ఆయన్నే టార్గెట్ చేయడం అసంబద్ధంగా ఉందని పేర్కొన్నాయి.
ఆంక్షలు విధించే అవకాశం!
మరోవైపు, ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ పేర్కొన్నారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సేకరించిన సాక్ష్యాల వల్లే కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించామని తెలిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం నిజ్జర్ హత్య కేసులో జరుగుతున్న దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు.
"దౌత్యపరమైన వెసులుబాట్లను వదులుకోవాలని, అలాగే విచారణకు సహకరించాలని భారత్‌ను కోరాం. అందుకు నిరాకరించింది. దౌత్యవేత్తలను బహిష్కరించడం వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఒక దేశం తీసుకోగల అత్యంత కఠినమైన చర్య. భారత్‌కు సంబంధించిన ప్రతి విషయం మా పరిశీలనలో ఉంది. మాకు భారత్‌తో దౌత్యపరమైన ఘర్షణ అక్కర్లేదు. ఏటా వేలాది మంది కెనడియన్లు భారత్‌కు వెళ్తారు. అలాగే భారతీయులు కూడా కెనడాకు వస్తారు. ప్రజల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని మాకు తెలుసు. మా దేశ పౌరులను కాపాడడమే కెనడా ప్రభుత్వం ముఖ్యమైన పని." అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యానించారు.
ఇదీ వివాదం
భారత ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాల ద్వారా కెనడా పౌరులపై దాడి చేయడానికి, సొంత గడ్డపైనే వారికి అరక్షిత వాతావరణం కల్పించడానికి తన దౌత్యవేత్తలను నియమించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది దిల్లీ చేసిన ఘోర తప్పిదమన్నారు. భారత ప్రభుత్వ ఏజెంట్లు తమ పౌరులపై బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి రెండు దేశాలు దౌత్యవేత్తల్ని బహిష్కరించిన తర్వాత ట్రూడో మీడియాతో మాట్లాడుతూ భారత్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా భారత్ తీవ్రంగా స్పందించింది.