Hamas Proposal For Permanent Ceasefire : కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ -హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయుధాలు వీడి గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరాలనుకుంటున్నట్టు ఓ వార్తాసంస్థతో తెలిపారు. హమాస్‌ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదని, ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగిందని పేర్కొన్నారు.
యుద్ధం ముగుస్తుందని తమకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తామని అల్-హయ్యా వ్యాఖ్యానించారు. ఒకవేళ హమాస్‌ను ఇజ్రాయెల్ అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి అని ప్రశ్నించారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఖలీల్ అల్ -హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశం లేదు. అక్టోబర్ 7 నాటి దాడుల తర్వాత హమాస్‌ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు కూడా ఏ మాత్రం సుముఖంగా లేదు.
135 రోజుల సీజ్ఫైర్
ఇంతకుముందు కూడా హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదించింది. ఈ మేరకు ఫిబ్రవరిలో పలు వార్తా సంస్థలు నివేదికలు వెలువరించాయి. వాటి ప్రకారం, ఒక్కో దశ 45 రోజుల చొప్పున 3 దశల్లో అమలయ్యేలా అమలయ్యేలా సుదీర్ఘ కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలను ప్రతిపాదనలో హమాస్ పొందిపరిచింది. దీని ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తారు. అంతేకాకుండా గాజా పునర్నిర్మాణం, ఇజ్రాయెల్ దళాల ఉప సంహరణ, మృతదేహాల మార్పిడి వంటి అంశాలను హమాస్ పంపిన లేఖలో పేర్కొంది.
తగ్గేదేలే : నెతన్యాహు
అయితే హమాస్ నేతల డిమాండ్లకు తలొగ్గేదే లేదని, విజయానికి అత్యంత చేరువలో ఉన్నామని ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. 'గాజాలో విజయానికి దగ్గర్లో ఉన్నాం. కొన్ని నెలల్లోనే యుద్ధాన్ని ముగిస్తాం. హమాస్‌ను అంతమొందించడం, బందీలను విడిపించుకోవడం, ఇజ్రాయెల్‌కు గాజా ప్రమాదకరం కాకుండా చేయడమే మా లక్ష్యాలు. ఖాన్ యూనిస్ తర్వాత రఫాలో భూతల దాడులు చేస్తాం. సంపూర్ణ విజయానికి ప్రత్యామ్నాయం లేదు. సైనిక ఒత్తిడి ద్వారానే బందీల విడుదల సాధ్యం. హమాస్ డిమాండ్లను అంగీకరించడమంటే విపత్తును స్వాగతించడమే' అని ఆయన మీడియాతో చెప్పారు.
'నా గర్ల్‌ఫ్రెండ్ బర్గర్ తింటావా?'- ఫ్రెండ్‌ను కాల్చి చంపిన యువకుడు - Kills Friend For Burger Bite
'అమెరికా వైదొలగితే ప్రపంచాధినేతగా ఎవరు ఉంటారు?'- బైడెన్ కీలక వ్యాఖ్యలు - US President Elections 2024