Vitamin D Good Medicine for Hair Loss Prevention : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? చేతులతో తాకితేనే ఊడుతోందా? అందుకు వంశపారంపర్యం, నిద్రలేమి, ఒత్తిడి, కాలుష్యం.. ఇలా అనేక కారణాలుండొచ్చు. వీటన్నింటికంటే ముఖ్యంగా మీ శరీరంలో 'విటమిన్ డి' లోపించడం కూడా జుట్టు సమస్యలకు ప్రధాన కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి, డైలీ డైట్లో విటమిన్ డి తగిన మోతాదులో చూసుకోవడం చాలా అవసరమంటున్నారు. అలాగే.. విటమిన్ డి(Vitamin D) సమృద్ధిగా ఉండే కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంపూర్ణ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి.. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో విటమిన్ ‘డి’ పాత్ర ఎంత కీలకమైనదో తెలిసిందే. అదేవిధంగా.. జుట్టు సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా శరీరంలో విటమిన్ డి లెవల్స్ తగ్గకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విటమిన్ డి లోపం హెయిర్ ఫాల్, అలొపేసియా (జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం)(National Library of Medicine రిపోర్టు) సమస్యలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. మీ హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి.. తగిన మోతాదులో డి విటమిన్ తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు.
2014లో "జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఈస్తటిక్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి సప్లిమెంటేషన్ హెయిర్ ఫాల్ ఉన్న మహిళల్లో జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ NHS ట్రస్ట్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ Fiona Jane Bath-Hextall పాల్గొన్నారు.
విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలివే..
చేపలు : ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో విటమిన్ D సమృద్ధిగా ఉంటుంది. అలాగే వీటిలో.. ఉండే కాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్.. వంటి ఇతర పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి.
పుట్టగొడుగులు : వీటిలో కూడా విటమిన్ ‘డి’ స్థాయులు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్.. వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, రోజూ వీటిని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
పాలు, పెరుగు : శరీరానికి కావాల్సిన D విటమిన్‌ని అందించడంలో పాలు, పెరుగు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అలాగే వీటిలో ఉండే.. ప్రొటీన్స్, కాల్షియం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
కమలా పండ్లు : వీటిలో విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడంతో జుట్టు సమస్యల నివారణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా.. గుడ్డు పచ్చసొన, తృణధాన్యాలు, చీజ్, సోయాపాలు, ఓట్స్ వంటి వాటిలో కూడా విటమిన్ ‘డి’ అధికంగా ఉంటుందంటున్నారు. కాబట్టి వీటిని డైలీ డైట్లో చేర్చుకున్నా శరీరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుందని చెబుతున్నారు.
ఆహార పదార్థాలే కాకుండా.. డైలీ మార్నింగ్ లేలేత సూర్యకాంతిలో కనీసం పదిహేను నిమిషాలు నిల్చోవడం ద్వారా తగినంత విటమిన్ డి అందుతుందంటున్నారు! ఇలా విటమిన్ డి ఉండే ఆహారాలను డైలీ డైట్లో చేర్చుకోవడం ద్వారా జుట్టు సమస్యలు రాకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
జుట్టును పదేపదే దువ్వుతున్నారా? వెంట్రుకలు రాలిపోతాయట జాగ్రత్త! హెయిర్ లాస్‌కు ఆయుర్వేద చిట్కాలు!
జుట్టు బాగా రాలుతోందా? - ఎరువు వేయాల్సింది నెత్తిన కాదు - పొట్టలో!