Smoking Vs Chewing Tobacco Which Is More Harmful : ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా కూడా చాలా మంది దీనికి బానిసలవుతుంటారు. కొంత మంది ఫ్యాషన్ పేరుతో పొగ తాగుతుంటే.. మరికొందరు ఈ అలవాటును మానుకోలేక రోజూ సిగరెట్లు కాలుస్తుంటారు. అయితే, సరదగా మొదలైన ఈ అలవాటు చివరికి ఒక వ్యసనంగా మారి ఎంతో మంది నిండు జీవితాలను బలిగొంటుంది. అయితే కొంత మంది స్మోకింగ్ చేస్తే, మరికొద్దిమంది పొగాకు, వాటి ఉత్పత్తులను నములుతుంటారు. కాగా, ఈ రెండూ ప్రాణాంతకమైనవే. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ డేంజర్ అనే డౌట్ చాలా మందికి వస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
స్మోకింగ్ చేయడం వల్ల: రోజూ సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి పొగాకు ఉత్పత్తులు తాగడం వల్ల బాడీలోని ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. వీటివల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎంఫిసెమా, ఉదరకోశ క్యాన్సర్ వంటి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గొంతు, నోరు, అన్నవాహిక, మూత్రశయ క్యాన్సర్ కూడా వస్తాయని చెబుతున్నారు.
పొగాకు నమిలితే ఏమవుతుంది ? సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ ఉంటుంది. ఇది పదేపదే వాటిని సేవించేలా మెదడును ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంత మంది పొగాకు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను నములుతుంటారు. ఇలా వాటిని నమలడం వల్ల కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందట. అలాగే వారిలో గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలికంగా పొగాకు నమలడం వల్ల నోటిలో తెల్లటి పాచెస్ ఏర్పడతాయి. ఇవి క్రమంగా క్యాన్సర్‌గా రూపంతరం చెందుతాయని తెలుపుతున్నారు.
ఏది ఎక్కువ హానికరం ?: పొగ తాగడం, పొగాకు నమలడం రెండు అలవాట్లు కూడా ఆరోగ్యానికి హాని కలిగించేవే. కానీ, పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల "స్మోకింగ్" అనేది చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. పొగ తాగడం వల్ల వారే కాకుండా ఆ పొగను పీల్చిన ఇతరులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వారిలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలు పరిశోధల్లో తేలింది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 41వేల మంది పొగ తాగని వారు కూడా, ఆ సిగరెట్ పొగను పీల్చి చనిపోతున్నారని 'సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (CDC) నివేదిక వెల్లడించింది. అలాగే 400 మంది శిశువులు మరణిస్తున్నారని పేర్కొంది.
ఇతర అనారోగ్య సమస్యలు:
- సిగరెట్ పొగ పీల్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.
- క్షయ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
- అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- అందుకే వీలైనంత వరకూ పొగ తాగడం, వాటి ఉత్పత్తులను నమలడం చేయకూడదని సూచిస్తున్నారు.
- అలాగే పొగ తాగని వారు ఆ గాలి పీల్చకుండా దూరంగా వెళ్లాలని చెబుతున్నారు.
నో స్మోకింగ్ డే - ఈ టిప్స్ పాటిస్తే సిగరెట్ అస్సలు ముట్టుకోరు!
ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా?- ఈ టిప్స్ ట్రై చేస్తే అస్సలు తాగరు!