Drinking Milk Right Time : పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అనే విషయం అందరికీ తెలుసు. రోజూ వీటిని తాగడం వల్ల శరీరానికి విటమిన్-డీ, కాల్షియం వంటివి అందుతాయి. ఎముకలను, గుండెను బలంగా మార్చుతాయి. పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందచ్చు. పాలలో పుష్కలంగా లభించే కాల్షియం దంత సమస్యలను నివారిస్తుంది. వీటితో పాటు వర్కౌట్ తర్వాత త్వరగా యాక్టివ్ అయ్యేలా చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలెన్నో ప్రతి రోజూ పాలు తాగడం వల్ల పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ పాలు తాగడంలో మీరు చేసే కొన్ని పొరపాట్లు నష్టాలకు దారితీయచ్చు. ముఖ్యంగా పాలు తాగే సమయాన్ని వాటి ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అసలు పాలు తాగడానికి సరైన సమయం ఏది? దీని గురించి ప్రముఖ న్యూరోస్పైన్ సర్జన్ డాక్టర్ వికాస్ కుమార్ ఏం చెబుతున్నారో చూద్దాం.
ఉదయాన్నే పాలు తాగిన తర్వాతే బ్రేక్ ఫాస్ట్ చేసేవాళ్లు కొందరు. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగి నిద్రపోయే వారు మరికొందరు. మరి వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ డాక్టర్ వికాస్ కుమార్ ప్రకారం, ఉదయాన్నే పాలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
కాబట్టి రాత్రి పూట పాలు తాగడమే మంచిదని చెబుతున్నారు డాక్టర్ కుమార్. పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. నిద్రలో శారీరక శ్రమ స్థాయి కూడా తగ్గుతుంది. ఉదయంతో పోలీస్తే రాత్రి పూట పాలు తాగడం వల్ల శరీరం పాల నుంచి కాల్షియంను ఎక్కువ మొత్తంలో గ్రహిస్తుంది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రాత్రి పడుకోవడానికి కనీసం అరగంట ముందు పాలు తాగాలి. తాగిన వెంటనే వెళ్లి మంచమెక్కడం మంచిది కాదట.
పిల్లల విషయానికొస్తే మాత్రం వారు పాలు రోజులో ఎప్పుడైనా తాగవచ్చట. ఎందుకంటే బిడ్డల శారీరక, మానసిక ఎదుగులలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కనుక వారికి ఏ సమయంలో అయినా పాలను ఇవ్వచ్చట. పాలు పిల్లలు రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషాలను అందిస్తాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.