Potatoes Health Benefits : ఆహారం విషయానికొస్తే ఆలూను మనం ఎప్పుడూ వద్దనుకోలేం. పరోటా, చిప్స్, కర్రీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుగా వండుకుని తినే బహుముఖ ప్రయోజనకారి బంగాళదుంప. దీంట్లోని అధిక కేలరీల కారణంగా ఇది అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం కాకపోవచ్చు. కానీ అందాన్ని పెంపొందించే పదార్థంగా మాత్రం ప్రతి ఒక్కరికీ పనికొస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
వెంట్రుకల నుంచి చర్మం వరకూ ఎన్నో రకాలుగా మీ అందాన్ని పెంచే శక్తి ఆలూకు ఉంది. బంగాళాదుంపల్లో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ సమస్యను తగ్గించి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గించి మిమ్మల్ని యవ్వనంగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇందుకోసం ఆలూను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
అలసిన కళ్లకు ఉపశమనం:
అలసిన కళ్లకు ఉపశమనం కలిగించేందుకు దోసకాయలు, గ్రీన్ టీ బ్యాగ్‌ల గురించి మీరు వినే ఉండచ్చు. కానీ వాటిని మించిన ఫలితాలను మీకు బంగాళాదుంపలు కలిగిస్తాయని మీకు ఎవరైనా చెప్పారా? అవును ఆలూ ముక్కలు కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, ఉబ్బినట్లు కనిపించడాన్ని తగ్గిస్తాయి. ప్రకాశవంతంగా, మరింత మెలకువగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రెండు సన్నని బంగాళాదుంప ముక్కలు కట్ చేసి 10 నుంచి 15 నిమిషాలు కళ్లపై ఉంచండి. వీటిని ఉపయోగించే ముందు వాటిని రిఫ్రిజిరేటర్లో కాసేపు ఉంచితే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.
గ్రే హెయిర్ కోసం!
ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటానికి వయసుతో సంబంధం లేకుండా పోతోంది. కానీ మీ నెరిసిన జుట్టుకు పరిష్కారం మీ వంటింట్లోనే ఉందని తెలుసా? అది కూడా మీరు పడేస్తున్న ఆలూ తొక్కలు అంటే నమ్ముతారా? అవును పడేస్తున్న బంగాళదుంప తొక్కలు మీ జుట్టుకు మంచి రంగునిస్తాయి. ఆలూ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి పెట్టుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలకు శుభ్రంగా పట్టించి కాసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ వెంట్రుకల నల్లగా, కాంతివంతంగా తయారవుతాయి.
మొటిమలు, మచ్చల నివారిణి:
బంగాళాదుంప రసంలో చర్మాన్ని కాంతివంతంగా చేసే గుణాలున్నాయి. నల్లటి వలయాలను తగ్గించడమే కాకుండా మొటిమలు, మచ్చలను పొగొట్టడంలో ఆలుగడ్డ రసం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు బంగాళదుంప నుంచి రసాన్ని తీసి ముఖానికి చక్కగా పట్టించాలి. 15నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రెండు నెలలపాటు ప్రతి రోజూ చేస్తే మొటిమలు, మచ్చలు మాయమైపోవడం ఖాయం. అదనంగా అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మం యవ్వనంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
సూర్యరశ్మి నుంచి రక్షణ
బంగాళాదుంపల్లో లభించే ఎంజైములు, విటమిన్లు ఎండ వేడికి దెబ్బతిన్న చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చుతుంది. చర్మపు లోతుల్లోంచి పోషణ అందించి మంట, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకు మీరు ఆలూను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా రాసుకోవాలి.పావుగంట తర్వాత కడుక్కోవాలి.
కురులకు పోషణ:
చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణలోనూ ఆలూ చక్కగా సహాయపడుతుంది. బంగాళాదుంప రసంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బంగాళాదుంపల నుంచి రసం తీసుకుని కుదుళ్లతో సహా తలంతా పట్టించాలి. 30 నిమిషాల నుంచి 60నిమిషాల వరకూ అలాగే ఉన్న తర్వాత షాంపూతో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ రసాన్ని జుట్టుకు వాడటం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలపడి జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.