Poonam Pandey Died With Cervical Cancer : మహిళల ప్రాణాలను నిలువునా తోడేసే భయంకరమైన రోగాలు చాలానే ఉన్నాయి. ఇందులో రెండు రకాల క్యాన్సర్లు ముందు వరసలో ఉంటాయి. వీటిలో ఒకటి రొమ్ము క్యాన్సర్ కాగా.. రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్! పూనమ్ పాండే ప్రాణాలను బలిగొన్నది ఈ రెండో రకం క్యాన్సరే! దీన్నే ఇంగ్లిష్‌లో సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ పట్ల కొందరికి అవగాహన ఉన్నప్పటికీ.. సర్వైకల్ క్యాన్సర్ మాత్రం చాలా మంది జనాలకు తెలియదు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించలేకపోతే.. ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ద్వారా.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావొచ్చు. గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకున్నా వస్తుంది. ఎక్కువమందితో శృంగారంలో పాల్గొనడం ద్వారా కూడా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇవేకాకుండా.. మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
చాలా నెమ్మదిగా..
ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. అది క్యాన్సర్‌గా మారడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 15 నుంచి 20 ఏళ్ల టైమ్ పడుతుందని నిపుణులు అంటున్నారు. ఆ తర్వాతనే లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందట.
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు..
- ఈ క్యాన్సర్ వచ్చిన వారికి పీరియడ్స్ టైంలో అధికంగా రక్తస్రావం అవుతుంది.
- పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.. తరచూ కడుపుబ్బరంగా ఉంటుంది.
- పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తారు. ఆ సమయంలో నొప్పిగా ఉంటుంది.
- సెక్స్‌లో పాల్గొన్నప్పుడు.. ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంటగా ఉంటుంది.
- మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొంటే.. సంభోగం తర్వాత రక్తస్రావం అవుతుంది.
- దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి అవుతుంది.
- అలసట, నీరసం, విరేచనాలు ఇబ్బంది పెడుతుంటాయి.
- ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎలా గుర్తిస్తారు?
సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించడానికి.. 'పాప్ స్మియర్ టెస్ట్' అనే టెస్ట్ చేస్తారు. పైన చెప్పిన లక్షణాల ఆధారంగా వైద్యులు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి.. వాటిని పరీక్షించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఇంకా పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు.
ముందు జాగ్రత్తలే రక్ష..
క్యాన్సర్ ఎలా పీడిస్తుందో తెలిసిందే. ప్రాణాలను కొద్ది కొద్దిగా తినేస్తుంది. అందుకే.. చికిత్సకన్నా నివారణే మేలు అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. ఈ వ్యాధి బారిన పడకుండా మహిళలు ముందస్తు టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సిన్ వేస్తారు. అదేవిధంగా.. 21 ఏళ్ల వయసు దాటిన మహిళలు.. 'పాప్ టెస్ట్' చేయించుకోవాలని చెబుతున్నారు. తద్వారా ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించి.. చికిత్స తీసుకోవచ్చని అంటున్నారు. దీంతోపాటుగా.. అసురక్షిత లైంగిక చర్యల్లో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు మిగడం వంటివి చేయకూడదని సలహా ఇస్తున్నారు.