Micro Pigmentation For Vitiligo : బొల్లి, తెల్లపూత, విటిలిగో, లికో డర్మా అనే రకరకాల పేర్లతో బొల్లి మచ్చల చర్మసంబంధిత సమస్యను పిలుస్తారు. అయితే మనలో కొంత మంది బొల్లి మచ్చలతో బాధపడుతుపడుతుంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటిపై తెల్లటి మచ్చలు కనిపిస్తే వారిలో వారే ఆత్మన్యూనత భావానికి లోనై కుంగిపోతుంటారు. నలుగురిలో కలవడానికి ఇష్ట పడకుండా ఇంట్లోనే ఉంటారు. ఇంకా సమాజంలో వీరు పెళ్లిళ్ల నుంచి ఉద్యోగాల వరకు చాలా చోట్ల వివక్షను ఎదుర్కొంటారు. అయితే, ఇలా బొల్లి మచ్చల సమస్యతో బాధపడేవారికి ఆధునిక వైద్యరంగంలో ఓ అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స వల్ల శరీరంపై ఉండే తెల్లటి మచ్చలను కనిపించకుండా చేసుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ ట్రీట్‌మెంట్ ఏంటి ? ఇందులో ఏం చేస్తారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోపిగ్మెంటేషన్ :
ఆధునిక వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటి వరకూ బొల్లి మచ్చలు రావడానికి గల స్పష్టమైన కారణాలను వైద్యులు కనుగొనలేకపోయారు. బొల్లి మచ్చలు అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల, అలాగే కొంతమందిలో వంశపారంపర్యంగా వస్తుందని అంటున్నారు. అయితే, ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత శరీరంలోని మరిన్ని భాగాలకు విస్తరించకుండా ఉండటానికి తగిన చికిత్స తీసుకోవడమే మార్గమని నిపుణులు చెబుతున్నారు.
ఈ మైక్రోపిగ్మెంటేషన్ చికిత్స అనేది ఒక కాస్మెటిక్ ట్రీట్‌మెంట్. ఇందులో తెల్ల మచ్చలు ఉన్న చోట పచ్చబొట్టులా ట్రీట్‌మెంట్ చేస్తారు. దీనివల్ల తెల్లమచ్చలు కనిపించకుండా మిగతా చర్మభాగాల్లానే కనిపిస్తాయి. దీనివల్ల బొల్లి మచ్చలతో బాధపడేవారిలో కొంత వరకు ఆత్మవిశ్వాసం, నమ్మకం కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైనటువంటి చికిత్సను వైద్య పరిబాషలో 'మెడికల్ టాటూయింగ్' అని అంటారు. ఈ మైక్రోపిగ్మెంటేషన్ చికిత్సను పెదవులు, చేతివేళ్లు, చేతులు, కాళ్లు, మోచేతులు వంటి ఇతర భాగాల్లో చేస్తారు. ఈ టాటూయింగ్ ట్రీట్‌మెంట్ చేసుకోవడం వల్ల తెల్ల మచ్చలు ఉన్న భాగాలు మిగతా అన్నింటిలాగే కనిపిస్తాయని తెలియజేస్తున్నారు.
మైక్రోపిగ్మెంటేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- ఈ చికిత్స చేసుకోవడం వల్ల కొద్దిగా తెల్లమచ్చలు ఉన్న వారు తిరిగి వారి ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు.
- టాటూయింగ్ చేసుకోవడం వల్ల తాను బొల్లి మచ్చల సమస్యతో బాధపడుతున్నాననే భావన నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చు.
- కొంత మంది పెదాలు, మోహంపై తెల్ల మచ్చలు ఉండటంతో నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి ఇదోక మంచి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.
గమనిక : పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు బొల్లి మచ్చలతో బాధడుతున్నట్లయితే.. మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.
మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే డయాబెటిస్ కావొచ్చు!
హార్ట్ అటాక్ వచ్చినవారు ఎక్సర్సైజ్ చేయొచ్చా? వైద్యులేం చెబుతున్నారు ?