How to Make Miriyala Charu : తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మిరియాల చారు చేసుకుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చారు కంపల్సరీగా చేసుకుంటారు. అద్భుతమైన రుచికోసమే కాకుండా.. జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యల నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ రెసిపీ చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ మిరియాల చారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ చారు సిద్ధమైపోతుంది. ఈ చారు కాంబినేషన్లో బంగాళాదుంప ఫ్రై మొదలు.. ఏ వేపుడు అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్, చికెన్ వంటి నాన్‌వెజ్ వేపుళ్లు కూడా అద్భుతంగా ఉంటాయి. మరి.. ఇంతటి రుచికరమైన మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10 - 12
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు (నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి)
- టమాటాలు - 4
- నూనె - 1 టేబుల్ స్పూన్
- పసుపు - పావు టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 3
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 3 - 4
- కొత్తిమీర – చిన్న కట్ట
- ఇంగువ - 2 చిటెకెలు
- ఉప్పు - రుచికి సరిపడా
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్‌లా తాగేయొచ్చు!
తయారీ విధానం..
- ముందుగా.. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రోట్లో వేసి దంచుకోవాలి. అయితే.. మెత్తగా కాకుండా బరకగా నూరుకోవాలి.
- ఇప్పుడు స్టౌమిద గిన్నె పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
- తర్వాత టమాటా ముక్కలు అందులో వేసి, గుజ్జుగా అయ్యేదాక మగ్గినివ్వాలి.
- మగ్గిన తర్వాత చింతపండు రసం, దంచిపెట్టుకున్న మిరియాల మిశ్రమం, కరివేపాకు కొత్తిమీరా, ఉప్పు, ఇంగువ వేయాలి.
- ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, ఆ వెంటనే దింపేసుకోవాలి. అంతే.. అద్భుతమైన మిరియాల రసం సిద్ధమైపోతుంది.
- ఈ మిరియాల చారు అన్నంతోపాటు ఇడ్లీ, వడ వంటి టిఫెన్లోనూ సూపర్‌గా ఉంటుంది.
- వర్షాకాలం సీజన్లో జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు.. వడకట్టి ఛాయ్ మాదిరిగా తాగితే ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది.
- మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోటిలో దంచితేనే బాగుంటాయి. మిక్సీలో వేస్తే ఫ్లేవర్ మిస్ అవుతుంది.
- ఇక.. కొత్తిమీర, కరివేపాకు కాడలతో సహా చారులో వేసేయాలి.
- అన్నిటికన్నా ముఖ్యమైనది.. చారు ఒక్క పొంగుతోనే దింపేసుకోవాలి. బాగా మరిగితే చారులోని సువాసన తగ్గిపోతుంది.
Rasam Recipes : కొంచెం కారంగా.. కొంచెం ఘాటుగా.. ఆరోగ్యం రసాలూరు