How Much Walk need for a person Daily : గతంలో అందరూ శారీరక శ్రమతో కూడిన పనే చేసేవారు. కానీ ఇప్పుడు? కూర్చుని వర్క్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో లెక్కలేదు. అందుకే.. ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సి వస్తోంది. కొందరికి అది కూడా కుదరట్లేదు. ఇలాంటివారు కనీసంగా కొన్ని అడుగులు వేయాలని చెబుతున్నారు. వయసును బట్టి లెక్క కూడా చెబుతున్నారు నిపుణులు. మరి.. మీ వయసెంత? మీరు ఎన్ని అడుగులు వేయాలో ఇక్కడ చూద్దాం.
ఈ ఆధునిక కాలంలో జనాన్ని రెండు సమస్యలు ప్రధానంగా చుట్టు ముట్టాయి. ఇందులో ఒకటి శారీరక శ్రమ లేకపోవడం. ఈ కారణంగా.. రోజులో ఒక్కసారైనా ఒంట్లోంచి చెమట రాని వారు ఎంతో మంది. ఇదే.. హానికరమైన జీవన విధానం అనుకుంటే.. మరొకటి తిండి. గతంలో జొన్నలు, సజ్జలతోపాటు రైస్ మాత్రమే తినేవారు. ఇప్పుడు నోరు తిరగని పేర్లతో తయారయ్యే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో ప్లేట్లు నిండిపోతున్నాయి. అవి తిన్నవారి బొజ్జలు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి.
ఈ విధంగా.. ఇటు టేస్ట్ పేరుతో ఎడాపెడా లాగించేస్తున్నారు. అటు శరీరానికి శ్రమ లేకపోవడంతో లావెక్కిపోతున్నారు. ఈ రెండు జీవన విధానాలు మనిషి ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా కొరికేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ప్రతిఒక్కరూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అది కూడా కుదరకపోతే.. రోజులో కొన్ని అడుగులు వేయాలని చెబుతున్నారు. వయసును బట్టి కనీసంగా వేయాల్సిన అడుగులను కూడా లెక్కకట్టి చెబుతున్నారు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ ప్రకారం.. ప్రతి వ్యక్తి (పెద్దలు) రోజూ కనీసం 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించాలట. నడక అనేది గుండెకు ఎంత మేలు చేస్తుందో మాటల్లో చెప్పలేం అంటారాయన. గుండె జబ్బులను నివారించడమే కాకుండా.. మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్, ఊబకాయం, రొమ్ము క్యాన్సర్‌తోపాటు డిప్రెషన్ కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు. దీంతో.. మనిషి ఫుల్ హెల్దీగా ఉంటాడని సూచిస్తున్నారు.
10,000 అడుగులు నడవడం అంటే.. దాదాపు 7.5 కిలోమీటర్లు. అయితే.. దీనర్థం ఇంత దూరం వాకింగ్ చేయడం అని కాదు. నిద్ర లేచి బెడ్ మీద నుంచి కిందకు అడుగు పెట్టింది మొదలు.. రాత్రి బెడ్ మీదకు చేరే వరకు వేసే ఆఖరి అడుగు కూడా ఈ లెక్కలోకి వస్తుంది. కాబట్టి.. ఉదయం ఓ గంటపాటు వాకింగ్ చేస్తే.. ఈ మొత్తం కవర్ చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. పిల్లల విషయానికి వస్తే.. వారు రోజూ కనీసం గంటన్నరపాటు ఆటలు ఆడుకోవాలని సూచిస్తున్నారు. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. శరీరాన్ని దృఢంగా మారుస్తుందని చెబుతున్నారు.
ఏ వయసు వారు ఎన్ని అడుగులు..?
40 ఏళ్లలోపు మహిళలు - రోజులో 12,000 అడుగులు నడవడం మంచిదట.
40 నుండి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలు - రోజూ 11,000 అడుగులు వేయాలని టార్గెట్ పెట్టుకోవాలట.
50 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలు - రోజూ 10,000 అడుగులు వేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారట.
60 ఏళ్లు పైబడిన మహిళలు 8,000 అడుగులు వేసేలా చూసుకోవాలట.
పురుషుల విషయానికి వస్తే.. 18 నుండి 50 సంవత్సరాల వయస్సులోపు వారు రోజూ 12,000 అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
50 ఏళ్లు పైబడిన పురుషులు - రోజూ 11,000 అడుగులు వేయాలని టార్గెట్ పెట్టుకోవాలి.
గతంలో.. ఈ విషయమై పలు పరిశోధనలు జరిగాయి. వీటి ప్రకారం రోజులో ఒక మనిషి కనీసం 4 వేల నుంచి 5 వేల అడుగులైనా వేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పెడ్రో F. గార్సియా ఆధ్వర్యంలో 2023లో నిర్వహించిన స్టడీలో కనీసం 4 వేల అడుగులు వేయడం ఆరోగ్యకరమని తేల్చారు. మరింత ఎక్కువగా నడిస్తే మంచిదని పేర్కొన్నారు.
గమనిక : మనిషి ఆరోగ్యం.. బరువు ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సందేహం ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత నడక మొదలు పెట్టండి.