Health Tips In Rainy Season : వర్షాకాలంలో తరచూ కురిసే వానాలతో వాతావరణం చల్లగా మారిపోతుంటుంది. దీనివల్ల చాలా మంది జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ కాలంలో అనారోగ్యం బారిన పడడానికి వాతావరణ మార్పులే కాకుండా.. మనం తీసుకునే ఆహారం కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ సీజన్లో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలం ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డైటీషియన్ 'డాక్టర్ శ్రీలత' చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వేయించిన ఆహార పదార్థాలు :
ఈ సీజన్లో ఆయిల్లో వేయించిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. వర్షాకాలంలో వెదర్లో తేమ పెరిగి.. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి, ఈ టైమ్‌లో ఆయిల్లో ఫ్రై చేసిన పదార్థాలు తినడం వల్ల ఈజీగా జీర్ణంకావు. దీనివల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అందుకే వానాకాలంలో నూనెతో చేసిన పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
స్ట్రీట్ ఫుడ్ వద్దు!
ఎక్కువ మంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయట దొరకే చాట్, పానీపూరీ, కట్‌లెట్, పావ్‌బాజీ.. వంటి పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ, వీటి తయారీలో కలుషితమైన నీరు ఉపయోగిస్తే.. విరేచనాలు, పచ్చకామెర్లు.. వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీలైతే ఇంట్లోనే చేసుకుని తినడానికి ప్రయత్నించండి. అలాగే పండ్ల రసాలు కూడా ఇంట్లోనే చేసుకుంటే మంచిది.
ఆకు కూరలు బాగా కడగాలి!
మార్కెట్లో ఆకుకూరలు నేరుగా భూమిలోంచి తీసి కట్టలు కట్టి అమ్ముతుంటారు. ఈ క్రమంలో వాటిపై మట్టిలోని క్రిములు, పురుగులు ఈ ఆకులపై చేరతాయి. కొన్నిసార్లు ఆకుల రంగులోనే కలిసిపోయిన ఈ పురుగుల్ని గమనించకుండా ఆకుల్ని అలాగే కట్ చేసి తీసుకోవడం వల్ల.. క్రిములు పొట్టలోకి చేరతాయి. అందుకే ఒక్కో ఆకు పరిశీలించాకే తరుక్కోవాలి. అలాగే ఆకులను బాగా కడిగిన తర్వాత వండుకోవాలి. భూమిలో మొలకెత్తే పుట్టగొడుగులు, దుంపలను కూడా ఇలానే క్లీన్ చేయాలి.
ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి :
కొంతమంది ఆఫీసులకు వెళ్లే మహిళలు కూరగాయలు, పండ్లు ముందురోజు రాత్రే కట్ చేసుకొని పెట్టుకుంటారు. అయితే వర్షాకాలంలో ఇలా చేయకూడదు. ఎందుకంటే కట్ చేసుకొని పెట్టుకున్న పండ్లు, కాయగూరల ముక్కల్ని ఎంత జాగ్రత్తగా భద్రపరచినా.. ఈ సీజన్లో వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి పండ్లు, కూరగాయలను ఎప్పటికప్పుడే కట్ చేసుకోవడం మంచిది.
నాన్‌వెజ్ :
వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ టైమ్‌లో జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదించడమే ఇందుకు కారణం. కాబట్టి ఈ సీజన్లో వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే మంచిది. అలాగే చేపలు, రొయ్యలు.. వంటి సీఫుడ్‌ని సైతం తక్కువ తీసుకోవడమే మంచిదని డాక్టర్ శ్రీలత సూచిస్తున్నారు.
ఈ టిప్స్ పాటించండి!
- వర్షాకాలంలో చిరుజల్లులు పడుతున్నాయని చాలా మంది ఉదయాన్నే వ్యాయామం చేయకుండా ఇంట్లోనే ఉంటారు. కానీ, ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయాలి.
- కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తే.. లంచ్, డిన్నర్లో ఓ ముద్ద తక్కువ తీసుకోవడమే మంచిది.
- చివరిగా సరిపడా నీళ్లు తాగడం, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని డాక్టర్ శ్రీలత సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
అలర్ట్ : వర్షాకాలం మీ కళ్లకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ సోకే ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే?