Good Habits for Healthy Life: ప్రతి ఒక్కరూ మంచి జీవితం కోసం కలలు కంటుంటారు. అయితే ఆ కలలను సాకారం చేసుకోవడంలో మన డైలీ రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయం దిశగా ప్రయాణించాలంటే జీవితంలో కొన్ని మంచి అలవాట్లు(Habits) అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలవాట్ల మీదే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మంచి అలవాట్లు మనిషిని ఉన్నత హోదాలో నిలబెడితే.. చెడు అలవాట్లు పాతాళానికి తొక్కేస్తాయి. అందుకే నిపుణులు కూడా రోజూ కొన్ని మంచి అలవాట్లను ఫాలో అయితే మీ శ్రేయస్సును పెంచుకోవడంతో పాటు మీ మీ రంగాలలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
త్వరగా నిద్రలేవడం : జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన మంచి అలవాటు.. త్వరగా నిద్ర లేవడం. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. మార్నింగ్ త్వరగా మేల్కొనడం వల్ల చాలా లాభాలున్నాయి. ఈ అలవాటు మీ రోజులో మంచి ఉత్సాహాన్ని నింపుతుంది. పని చేయడానికి మీకు తగినంత శక్తిని ఇస్తుంది. ఎక్కువ సమయం లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి కంట్రోల్లో ఉండి మీ బాధ్యతలను చక్కగా నిర్వహించగలుగుతారు.
నిద్ర లేవగానే వాటర్ తాగడం : మీరు ఫాలో అవ్వాల్సిన మరో గుడ్ హ్యాబిట్ ఏంటంటే.. రాత్రి నిద్ర తర్వాత మీ శరీరాన్ని రీ హైడ్రేట్ చేయడానికి నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం. ఎందుకంటే నీరు మీ జీవక్రియను కిక్‌స్టార్ట్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే వివిధ శారీరక విధులకు మద్దతు ఇస్తుంది.
మెడిటేషన్ : డైలీ లైఫ్‌లో మానసిక ప్రశాంతతను పొందాలంటే మీరు కచ్చితంగా మైండ్‌ఫుల్‌నెస్ లేదా మెడిటేషన్ సాధన చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించాలి. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా యోగా, ధ్యానం చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉండి సరైన ఆలోచనలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహారిస్తుంది.
వ్యాయామం : రోజూ వారి దినచర్యలో వ్యాయామం తప్పనిసరి. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దాంతో చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాకాకుండా మీ డైలీ లైఫ్‌లో వ్యాయామం లేదా ఒక రకమైన శారీరక శ్రమను చేర్చండి. అది శక్తి స్థాయిలను పెంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితం.. రోజంతా చురుగ్గా ఉంటూ చేసే పనిలో మంచి ప్రతిభ కనబరుస్తారు.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ టాప్-7 టిప్స్ మీకోసమే!
సరైన టిఫెన్ : చాలా మంది ఈరోజుల్లో టైమ్ లేకనో, ఇంకేదో కారణం చేతనో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. దాంతో సరైన శక్తి లభించక ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటుంటారు. అలాకాకుండా మీరు డైలీ మంచి పోషకాలు నిండి ఉన్న అల్పాహారం తీసుకున్నారంటే శరీరానికి తగిన శక్తి లభించడమే కాకుండా ఆ రోజంతా మిమ్మల్నీ యాక్టివ్‌గా ఉంచుతుంది. అలాగే మీ డైట్లో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు ఉండేలా చూసుకోండి.
రోజూవారి పనులను ప్లాన్ చేసుకోవడం : మీ షెడ్యూల్‌ను సమీక్షించడానికి, పనులను పూర్తి చేయడానికి.. రోజూవారి ప్లానింగ్ కోసం కొన్ని నిమిషాలు టైం కేటాయించడం ముఖ్యం. ఇది మీరు వ్యవస్థీకృతంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది.
సోషల్‌మీడియాకు దూరంగా ఉండడం : ఇక చివరగా జీవితంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మీరు అలవర్చుకోవాల్సిన మరో మంచి అలవాటు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం. కాబట్టి వీలైనంత వరకు మేల్కొన్న వెంటనే ఈమెయిల్‌లు లేదా సోషల్ మీడియాలోకి వెళ్లడం మానుకోండి. చూశారుగా.. మీ డైలీ లైఫ్‌లో వీటిని అలవాటు చేసుకున్నారంటే మంచి పొజిషన్లో స్థిరపడడం ఖాయం. అవసరమైతే ఒక నెలపాటు ఫాలో అయితే రిజల్ట్ మీకే కనిపిస్తుందంటున్నారు నిపుణులు.