Drinking Water Too Much Health Problems : మనిషి ఆరోగ్యంగా ఉండానికి నీళ్లు చాలా అవసరం. మన శరీరంలోని వ్యర్థాలు అన్నీ తొలగిపోయి హెల్దీగా ఉండడానికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి రోజూ తగినంత నీటిని తాగాలి. అయితే.. తాగమన్నారు కదా అని కొందరు మరీ ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుంటారు. ఇలా నీటిని అధికంగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? వాటర్ ఎక్కువగా తాగితే కలిగే అనారోగ్య సమస్యలు ఏంటీ ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత :
మన శరీరం సక్రమంగా పని చేయడానికి సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలు చాలా అవసరమవుతాయి. అయితే, ఎక్కువగా నీటిని తాగడం వల్ల వీటి శాతం శరీరంలో తగ్గిపోతుందట. దీనివల్ల బాడీలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుందని నిపుణులంటున్నారు. దీంతో మానసిక గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే కొంతమందిలో మూర్ఛ, కోమా వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలపై ఒత్తిడి :
రక్తంలోని వ్యర్థాలను, నీటిని తొలగించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఎక్కువగా నీటిని తాగడం వల్ల మూత్ర పిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి ఒత్తిడికి గురవుతాయని నిపుణులంటున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కిడ్నీలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
నీటి మత్తు :
ఎవరైనా తక్కువ టైంలో ఎక్కువగా నీళ్లను తాగితే వాటర్ పాయిజనింగ్ కూడా అవుతుందట. దీనిని 'నీటి మత్తు' అని కూడా అంటారు. దీనివల్ల వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ సార్లు మూత్రవిసర్జన :
డైలీ ఎక్కువగా వాటర్ తాగితే మూత్రవిసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల రాత్రి పడుకున్నప్పుడు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
హైపోనాట్రేమియా (Hyponatremia) : రోజూ ఎక్కువగా నీటిని తాగడం వల్ల హైపోనాట్రేమియా అనే సమస్య రావచ్చు. ఇది రక్తంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడతుంది. దీనివల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అలాగే అలసట, తలనొప్పి, వికారం, గందరగోళం వంటి సమస్యలు కలుగుతాయని అంటున్నారు. 2015లో Annals of Internal Medicine జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు 3.7 లీటర్ల కంటే ఎక్కువగా నీటిని తాగిన వారిలో హైపోనాట్రేమియా వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారట.
నీటిని ఎన్ని గ్లాసులు తాగాలి ?
మనిషి ఆరోగ్యంగా ఉండానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. ఇది వ్యక్తి చేసే శారీరక శ్రమ, బరువు వంటి వివిధ అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ నుంచి కిడ్నీల ఆరోగ్యం వరకు - దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలివే!
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే - వారం రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గడం గ్యారెంటీ!
సమ్మర్ స్పెషల్ రాగి జావ - ఇలా చేస్తే వద్దన్నోళ్లు కూడా రెండు గ్లాసులు తాగడం పక్కా!