Diabetes Patients Eat Fruits : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మధుమేహం ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు. అయితే, షుగర్ ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తారు. ఎందుకంటే.. చక్కెర ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారు చక్కెర తక్కువగా ఉండే ఈ 5 పండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిట్రస్ ఫ్రుట్స్ (Citrus Fruits) : నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎన్నో రకాల పోషకాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సిట్రస్ పండ్లలో ఉంటాయి. వీటిలో చక్కెర చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. కాబట్టి, మధుమేహంతో బాధపడే వారు వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
రాస్బెర్రీ (Raspberries) : రాస్బెర్రీలలో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. అలాగే.. ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్‌తో బాధపడుతున్న వారు రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులంటున్నారు. రాస్బెర్రీలలో ఆంథోసైనిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనాలుంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. 100 గ్రాముల రాస్బెర్రీలలో కేవలం 4.4 గ్రాముల చక్కెర ఉంటుందట. అందుకే, షుగర్ ఉన్నవారు వీటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్ట్రాబెర్రీలు : కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉండే స్ట్రాబెర్రీలలో చక్కెర ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇది నిజం కాదట. 100 గ్రాముల స్ట్రాబెర్రీలలో కేవలం 7 గ్రాముల చక్కెర ఉంటుందట. కాబట్టి, వీటిని షుగర్ పేషెంట్లు ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చంటున్నారు నిపుణులు.
షుగర్ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే? - Bananas For Diabetes Patients
కివీ : ఈ పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల కివీ పండ్లలో కేవలం 9 గ్రాముల చక్కెర ఉంటుందట.
పరిశోధన వివరాలు:
2014లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మధుమేహంతో బాధపడుతున్న వారు 12 వారాల పాటు రోజుకు రెండు కివీ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో ఇరాన్‌లోని 'షాహిద్ బెహేష్టి విశ్వవిద్యాలయం'లో పని చేస్తున్న 'డాక్టర్. మహ్మద్ అలీ ఘఫారీ' పాల్గొన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు డైలీ రెండు కివీ పండ్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అవకాడో : అవకాడలో విటమిన్ సి, ఇ, కె, బి వంటివి ఉన్నాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. అలాగే వీటిని రోజూ డైట్‌లో తీసుకోడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇంకా రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట. సగం అవకాడోలో కేవలం 0.66 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు వీటిని డైలీ తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ వ్యాధికి రోజూ మందులు వాడొద్దంటే - ఇలా చేస్తే సరిపోతుంది! - How To Control Diabetes
షుగర్ లెవెల్ మేనేజ్ చేసే సమ్మర్ డ్రింక్స్- ఇంట్లోనే చేసుకోండిలా - SUMMER DRINKS at home