Causes for Pins and Needles in Legs : కాళ్లలో ఏదో పాకుతున్నట్టు అనిపించటం.. దీంతో కాళ్లను కదిలించలేకుండా ఉండలేకపోవటం వంటి సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. ఈ సమస్యలు చాలా చిరాకు కలిగిస్తాయి. ఈ లక్షణాలు కొందరిలో అప్పుడప్పుడూ కనిపిస్తే.. మరికొందరిలో రోజూ కనిపిస్తాయి. ఇవి సాయంత్రం వేళ, రాత్రిపూట ఎక్కువవుతూ ఉంటాయి కూడా. దీంతో నిద్ర సరిగా పట్టక సతమతమవుతుంటారు. మరి మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ లక్షణాలు.. కాళ్ల చిరచిరకు సంబంధించినవని అంటున్నారు. అసలు ఈ సమస్య అంటే ఏమిటి? కారణాలు? లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కాళ్ల చిరచిరతో ప్రతి పది మందిలో ఒకరు బాధపడుతుంటారని నిపుణులు అంటున్నారు. వీరిలో 2 నుంచి 3% మందిలో సమస్య తీవ్రంగానూ ఉంటుందట. అయితే.. ఈ సమస్యతో బాధపడేవారిలో కుంగుబాటు, ఆందోళన, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలూ కనిపిస్తుంటాయని చెబుతున్నారు.
కాళ్ల చిరచిర లక్షణాలు:
- కాళ్ల మీద ఏదో పాకుతున్నట్లు అనిపించడం
- కాళ్ల మీద ముళ్లు గుచ్చుకున్నట్లు అనిపించడం
- చీమలు కుట్టినట్లు అనిపించడం
- కాళ్లు మొద్దుబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
కాళ్ల చిరచిరకు కారణాలు :
పెరిఫెరల్ న్యూరోపతీ: ఇది నరాల నష్టం వల్ల కలిగే ఒక పరిస్థితి అని నిపుణులు అంటున్నారు. ఇది తరచుగా మధుమేహం లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితుల వల్ల వస్తుందని చెబుతున్నారు.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్: ఇది ఒక నరాల రుగ్మత అని.. ఇది కాళ్లలో అసౌకర్యకరమైన అనుభూతులను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య కదలాలనే కోరికను కలిగిస్తుందని.. ఈ లక్షణాలు సాయంత్రం, రాత్రిపూట తీవ్రంగా ఉంటాయంటున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో కాళ్ల చిరచిర ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటాలోని మయో క్లినిక్‌లో న్యూరాలజీ అండ్ స్లీప్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ Michael A. Silbe పాల్గొన్నారు.
రక్త ప్రసరణ సమస్యలు: పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి రక్త ప్రసరణ సమస్యలు కాళ్లలో చిరచిరకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే కొన్ని మందులు కూడా కాళ్ల చిరచిరకు కారణమవుతాయని అంటున్నారు.
పోషకాహార లోపాలు: ఐరన్ లేదా విటమిన్ B12 లోపం వంటి కొన్ని పోషకాహార లోపాలు కాళ్ల చిరచిరకు కారణమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
కాళ్ల చిరచిర తగ్గించుకునేందుకు టిప్స్:
- పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం మేలని నిపుణులు అంటున్నారు. ఇవి మానసిక ప్రశాంతత చేకూర్చి చిరచిర తగ్గటానికి తోడ్పడతాయంటున్నారు. 2018లో Journal of Clinical Sleep Medicineలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) ఉన్న వ్యక్తులు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల కాళ్ల చిరచిర సమస్య తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ అండ్ స్లీప్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ Stephanie A. Fry పాల్గొన్నారు.
- నెమ్మదిగా కండరాలను సాగదీయటం, కాసేపు నడవటమూ మేలు చేస్తాయని. కావాలంటే కాళ్ల మీద బరువైన దుప్పటి కప్పుకోవచ్చని అంటున్నారు.
- కాళ్లను నెమ్మదిగా మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుందని అంటున్నారు.
- చిరచిర ఎక్కువయ్యేలా చేసే మద్యం, కెఫీన్, నికొటిన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
కళ్లజోడు మచ్చలు పోవడం లేదా ? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు! - How To Remove Glasses Marks