Risk Factors of Brain Tumour : మెదడు, దాని సమీపంలోని కణాల అసాధారణ పెరుగుదలనే బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు. ఇది మెదడులోని ఏదైనా భాగంలో కనిపించవచ్చు. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఇవి రావొచ్చు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ ప్రకారం.. 150కి పైగా రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. వీటిని ప్రైమరీ, మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అనే రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ఇందులో మెదడులోనే మొదలై పెరిగే కణితులను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని, శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకి వ్యాపించే కణితులను మెటాస్టాటిక్ (సెకండరీ) బ్రెయిన్ ట్యూమర్లు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ వీటిని త్వరగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇకపోతే ఇవి రావడానికి కారణమవుతున్న కొన్ని ముఖ్య కారకాలను ఇప్పుడు చూద్దాం.
మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించింది. ఎందుకంటే అధికంగా మొబైల్ ఫోన్ వాడితే దాని నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పరిమితం చేయడానికి పెద్దలు, పిల్లలు ఇద్దరికీ హ్యాండ్స్-ఫ్రీ హెడ్‌సెట్‌ను ఉపయోగించడాన్ని డబ్యూహెచ్ఓ ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆంకాలజీ ప్రకారం.. స్వీడిష్ పరిశోధకులు దీర్ఘకాలిక సెల్ ఫోన్ వినియోగం, బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ మధ్య రిలేషన్ ఉందని కనుగొన్నారు.
రసాయనాలకు గురికావడం : పురుగుమందులు, ద్రావకాలు, ఇతర పారిశ్రామిక కెమికల్స్‌కు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బ్రెయన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా వాటికి సమీపంలో నివసించే వారికీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అక్కడ నివసించే, పనిచేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అలాగే మనం వాడే షాంపూలు, సబ్బులు, పౌడర్‌లు వంటి ఉత్పత్తులు మెదడు కణితులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాడే ముందు ఉత్పత్తి లేబుల్‌లను పూర్తిగా చదవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్ ఫాగ్" ఉన్నట్టే!
హార్మోన్ల అసమతుల్యత : బ్రెయిన్ ట్యూమర్స్ ఏర్పడడంలో హార్మోన్ల కారకాలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు, టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్న పురుషులు, దీర్ఘకాలం హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకున్న మహిళలకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైద్యుల ప్రకారం, ఇంజెక్షన్లు, సబ్‌డెర్మల్ ఇంప్లాంట్లు లేదా గర్భాశయ పరికరాల ద్వారా హార్మోన్ల గర్భనిరోధకాలను తీసుకునే స్త్రీలు కూడా ఈ ట్యూమర్స్‌కు గురయ్యే అవకాశం ఉంది.
తల గాయం, మూర్ఛలు : పైన చెప్పినవే కాకుండా తలకు గాయమైన వ్యక్తులకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అనేక అధ్యయనాలు తల గాయం, బ్రెయిన్ ట్యూమర్ మధ్య సంబంధాన్ని వెల్లడించాయి. అదేవిధంగా మూర్ఛ వచ్చే వ్యక్తులకు కూడా మెదడు కణితి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆరోగ్యం తేడాగా అనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మీ బ్రెయిన్‌కు రెస్ట్ ఇస్తున్నారా - సైన్స్ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు!