Best Time To Drink Milk : మనం హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారంతోపాటు, ఒక గ్లాసు పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాల వంటివి పుష్కలంగా ఉన్నాయని సూచిస్తున్నారు. అందుకే పాలను సంపూర్ణ పోషకాహారంగా పరిగణిస్తారు. అయితే.. చాలా మందికి ఉదయాన్నే పాలు తాగడం అలవాటు ఉంటుంది. మరికొంత మంది పడుకునే ముందు తాగుతారు. మరి.. పాలలోని పోషకాలన్నీ శరీరానికి అందాలంటే ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా?
పోషకాలు అనేకం :
పాలలో విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తాగడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నిపుణులు అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు పాలను తాగడం వల్ల కంటి నిండా నిద్ర పడుతుందని చెబుతున్నారు. అలాగే మన శరీరం పాలలో ఉండే కాల్షియం స్థాయిలను రాత్రి సమయంలో తాగడం వల్ల అధికంగా గ్రహిస్తుందని తెలియజేస్తున్నారు. రాత్రి పడుకునే ఒక అరగంట ముందు పాలు తాగడం మంచిదని సూచిస్తున్నారు. కొంత మంది పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!
అలాగే మరికొంత మంది ఖాళీ కడుపుతో పాలను తాగితే మంచిదని పరగడుపున తాగుతుంటారు. కానీ.. ఇది కేవలం అపోహ మాత్రమేనట. అంతేకాదు.. ఇలా తాగడం ఇబ్బంది కూడా కలిగిస్తుందట. పరగడుపున పాలను తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. పిల్లలకు మాత్రం పాలను ఎప్పుడైనా అందించవచ్చని, ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తున్నారు.
పరిశోధన వివరాలు :
2013లో "Journal of Sleep Research" ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ పాలు తాగిన వారు, తాగని వారి కంటే తొందరగా నిద్రపోయారని పరిశోధకులు గుర్తించారట. అలాగే వీరు కంటినిండా నిద్రపోయినట్లు తేల్చారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ 'డాక్టర్. డేవిడ్ డేనియల్స్' పాల్గొన్నారు. ప్రతిరోజు పాలు తాగే వారు త్వరగా నిద్రపోతారని ఆయన చెప్పారు.
చివరిగా.. పాలను ఉదయం తీసుకున్నా లేదా పడుకునే ముందు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ.. నైట్ పడుకునే ముందు కొద్దిగా గోరువెచ్చగా ఉండే పాలను తాగడం వల్ల మంచి నాణ్యమైన నిద్ర సొంతమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రికార్డు స్థాయికి అమ్ముడైన ముర్రాజాతి గేదె- మెడలో డబ్బుల మాలవేసి సాగనంపిన యజమాని
ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - Heart Stroke In Summer