Causes of Anemia in Children: కొంతమంది పిల్లలు చూడడానికి బాగానే కనిపించినా ఆటలు ఆడిన పది నిమిషాలకే ఆయాసంతో కూర్చుండిపోతుంటారు. రోజంతా చురుకుగా ఉండకుండా.. ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఎంత మంచి భోజనం తయారు చేసి తినిపించినా.. ఆకలిగా లేదంటూ ముఖం తిప్పేసుకుంటారు. ఇలా సరైన టైమ్‌లో సమతుల ఆహారం తినకపోవడంతో చదువులోనూ రాణించలేరు. అయితే, ఇలాంటి లక్షణాలు పిల్లల్లో రక్తహీనత సమస్య ఉందనడానికి ఓ సంకేతం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిల్లల్లో రక్తహీనత (ఎనీమియా) సమస్య రావడానికి కారణాలు ఏంటి ? ఈ సమస్య నుంచి బయటపడేందుకు చిన్నారులకు ఎటువంటి ఆహారం అందించాలి ? అనే విషయాలను ప్రముఖ పిడియాట్రీషియన్ 'డాక్టర్ అపర్ణ వత్సవాయి' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు ఉండాల్సిన మోతాదు కన్నా.. తక్కువగా ఉన్నప్పుడు ఎనీమియాగా గుర్తిస్తాం. అయితే, పిల్లల్లో రక్తహీనత సమస్య రావడానికి కొన్ని కారణాలుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఈ క్రమంలో వారు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. అలాగే తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించడం వల్ల కూడా ఎనిమియా వచ్చే అవకాశాలుంటాయి. రక్తహీనత కారణంగా పిల్లల మెదడు చురుకుగా పనిచేయడం తగ్గిపోతుంది. దీనివల్ల వారు చిన్న పనులు చేసిన అలసిపోతారు. ఇలాంటి పిల్లల్లో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది.
"రక్తహీనత ఉన్న పిల్లలు కొద్దిసేపు ఆడుకోగానే ఆయాసం, నీరసంతో బాధపడతారు. అలాగే తెలివిగా ఆలోచించడంలో కాస్త వెనుకంజలో ఉంటారు. ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఉన్న చోటే ఎక్కువగా ఉంటారు. మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అంతగా ఆసక్తి కనబరచరు. చదువులోనూ ఎక్కువగా రాణించలేరు." -డాక్టర్ అపర్ణ వత్సవాయి
ఈ డైట్ బెస్ట్!: పిల్లల్లో రక్తహీనత ఉంటే.. తల్లిదండ్రులు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, తాజా పండ్లు, క్యారెట్, బీట్రూట్ వంటివి అందించాలని చెబుతున్నారు. అలాగే గుడ్లు, చికెన్ వంటి ఆహార పదార్థాలను తరచూ అందిస్తూ ఉండాలి. ఈ డైట్ ప్లాన్ పిల్లల్లో ఎనిమియా చాలా వరకు తగ్గిస్తుందని డాక్టర్ అపర్ణ వత్సవాయి తెలుపుతున్నారు. ఒక్కసారి పిల్లలు ఎనీమియా బారి నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ.. సమస్య రాకుండా పేరెంట్స్ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది
పిల్లల్లో విటమిన్ "డి" తగ్గితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట! - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడి