Sushmita Konidela Web Series : మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన 'పరువు' వెబ్ సిరీస్ ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆమెపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. సుస్మితతో పాటు మూవీటీమ్ను అభినందించారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"అద్భుతమైన విజయం అందుకున్న 'పరువు' టీమ్‌కి అభినందనలు. గ్రౌండ్ బ్రేకింగ్ కంటెంట్ అందించిన సుస్మితను చూస్తే గర్వంగా ఉంది. వెబ్ సిరీస్‌లో నా సోదరుడు నాగబాబు నటన అద్భుతంగా ఉంది. ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి పాట్లు. చివరికీ ఈ జంట తప్పించుకుందా లేదా అనేది సీజన్ 2లోనే చూడాలనుకుంటా! డోంట్ మిస్" అంటూ చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
'పరువు' ఎలా ఉంది?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా రిలీజ్ అయ్యింది ఈ సిరీస్. ఇందులో నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పల్లవి అలియాస్ డాలీ, తెలంగాణ అబ్బాయి సుధీర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. అది పల్లవి కుటుంబానికి, బంధువులకు నచ్చదు. హైదరాబాద్‌లో ఉంటున్న పల్లవి తన పెదనాన్న చనిపోయాడన్న వార్త తెలిసి, భర్తతో కలిసి సొంతూరికి బయలుదేరుతుంది. తనకు ఇష్టం లేకపోయినా పల్లవి బావ చందను తమ కారులో ఎక్కించుకోవాల్సి వస్తుంది. ప్రయాణంలో ఆమె బావ, సుధీర్‌ను తక్కువ చేసి మాట్లాడతాడు. అప్పుడు పల్లవి చందుతో వాగ్వాదానికి దిగుతుంది.
తమను చంపేందుకే చందు తుపాకీ తెచ్చాడని పల్లవిలో అనుమానం మొదలవుతుంది. మన కోసం కాదని సుధీర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా అతడిపై కోపగించుకుంటుంది. ఆ ఆవేశంలో సుధీర్, చందుని రాడ్డుతో కొట్టడంతో చనిపోతాడు. ఆ శవం ఎవరి కంటపడకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు, చందుతో పెళ్లి నిశ్చయమైన స్వాతి, అతను కనిపించడం లేదంటూ తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తుంది.
ఎమ్మెల్యే రామయ్య తనకు కాబోయేవాడిని కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపిస్తుంది. రామయ్యకు చందుకు ఉన్న సంబంధమేంటి? చందు హైదరాబాద్ వెళ్లడానికి కారణమేంటి? ఎవరిని చంపేందుకు తుపాకీ తీసుకున్నాడు? పెదనాన్న చివరి చూపు కోసం వచ్చిన పల్లవికి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? చందు డెడ్ బాడీని ఏం చేశారు? ఇవన్నీ తెలియాంటే సిరీస్ చూడాల్సిందే.
సింహాసనం కోసం గుడ్డూతో కాలీన్ భయ్యా పోరాటం - ఆసక్తికరంగా మీర్జాపుర్ 3 ట్రైలర్ - Mirzapur 3 Trailer
ఈటీవీ విన్‌లో కొత్త సిరీస్ శర్మ అండ్ అంబానీ- మరో #90స్ పక్కానా? - Sharma And Ambani Web Series