Neha Sharma Political Entry : దేశ రాజకీయాల్లో ఇప్పటికే ఎందరో సినీ నటులు రంగప్రవేశం చేసి కొందరు విజయం సాధిస్తే, మరికొందరు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సినీ రంగం నుంచి మరో కథానాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్ నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్ నేత అజిత్ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన తాజాగా మీడియాతో ముచ్చటించారు.
'హైకమాండ్ ఎలా చెప్తే అలా'
'బిహార్‌లోని భగల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. 'ఇండియా' కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహా శర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. ఈ విషయంపై పార్టీని సంప్రదిస్తున్నా. అయితే తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దే' అని భగల్‌పుర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ వెల్లడించారు.
బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాగా 'ఇండియా' కూటమి చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇక హీరో రామ్‌చరణ్ నటించిన 'చిరుత' సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ ఆ తర్వాత 'కుర్రాడు' చిత్రంలో ఆడిపాడింది. అనంతరం టాలీవుడ్‌కు దూరమైన ఆమె పలు హిందీ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది.
మాజీ క్రికెటర్‌కు ఎంపీ టికెట్!
మరోవైపు ఈసారి పార్లమెంట్ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు సినీ నటులతో పాటు క్రీడాకారులనూ బరిలోకి దింపుతున్నాయి. ఇందులో భాగంగా బంగాల్లోని అధికార టీఎంసీ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు టికెట్ ఇచ్చింది. బహ్‌రమ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ఓం భీమ్ బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే! - Ayesha Khan
'మాటిస్తున్నా - ఇద్దరిలో ఒక తలకాయే మిగులుతుంది' - Pawankalyan TheyCallHim OG