Kishkindha Kaandam Review In Telugu : 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం!' ఇది చిత్రంలో నటి అపర్ణా బాలమురళి పలికే డైలాగ్. కానీ, కిష్కింద కాండం సినిమా చూసే ఆడియెన్స్ అలా ఉండలేరు. సినిమా ఓ సారి చూడటం ప్రారంభించిన తర్వాత కథ కాస్త నెమ్మదిగా సాగుతూ పోతున్నా, నిజం తెలుసుకోవాలన్న ఉత్కంఠ మాత్రం వేగంగా కొనసాగుతుంది. దర్శకుడు దింజిత్ అయ్యతన్ తన టేకింగ్‌తో అలా తెరకెక్కించాడు మరి. కేవలం రూ.7 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర రూ.75 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. అలా ఈ ఏడాది మలయాళంలో రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం డిస్కీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఫైట్, పాట ఉండవు. అసలు అవి లేకుండా సినిమా తీయలేమా? అన్న దానికి అతి పెద్ద ఉదాహరణే కిష్కింద కాండం. మిస్టరీ థ్రిల్లర్స్‌లాంటి నేపథ్యమే అయినా, దానిని ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా అనిపించింది. కథలో ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా అద్భుతంగా తీశారు.
ఫారెస్ట్ ఆఫీసర్ అయిన అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ).. తన భార్య చనిపోవడం, నాలుగేళ్ల కొడుకు చాచు (మాస్టర్ ఆరవ్) కనపడకుండా పోవడం వల్ల అపర్ణ (అపర్ణా బాలమురళి)ను రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ తండ్రి అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి, అలానే మతిమరుపు మనిషి. అది ఎన్నికల సమయం కావడం వల్ల అప్పు పిళ్లైకి ఉన్న లైసెన్స్ తుపాకీని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని అధికారులు నోటీసులిస్తారు. అయితే, ఆ గన్ కనిపించకుండా పోతుంది. పోయిన తుపాకీని వెతుకుతున్న క్రమంలో అది ఓ కోతి చేతిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో, పిళ్లై కూడా ఆ గన్ తనదేనని ఒప్పుకొంటాడు. అయితే, అందులో ఉన్న రెండు బుల్లెట్స్ మాత్రం మిస్ అవుతాయి. మరి ఆ బుల్లెట్స్ ఏమయ్యాయి? అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? కనపడకుండా పోయిన కొడుకు చాచు ఏమయ్యాడు? అన్నది తెలియాలంటే ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.
ఆసిఫ్ అలీ రెండో పెళ్లి చేసుకోవడం, అప్పు పిళ్లై తుపాకీ కనపడకపోవడం అనే రెండు ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ను ప్రారంభ సన్నివేశాల్లో చక్కగా చూపించి ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, ప్రేక్షకుడి ప్రయాణం మాత్రం కథ నుంచి బయటకు పోదు. ఈ క్రమంలోనే అటు పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు పోయిన తుపాకీ కోసం సాగించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.
అప్పు పిళ్లై రెండేళ్ల క్రితం అమ్మేసిన స్థలంలో కోతికి సంబంధించిన అస్తి పంజరం కనపడటంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. పైగా అది చనిపోయి మూడేళ్లకు పైనే అయినట్లు ఫోరెన్సిక్ వాళ్లు చెప్పడంతో పోలీసులే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడి అనుమానం అప్పు పిళ్లైపైకి వెళ్తుంది. కోతి చేతిలో తుపాకీ ఉన్నట్లు ఫొటోలు బయటకు వచ్చిన తర్వాత సాగే ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరోవైపు అప్పు పిళ్లైకు నిజంగా మతిమరుపు సమస్య ఉందా? లేక ఉన్నట్లు నటిస్తున్నాడా? అన్న ప్రశ్న ప్రేక్షకుడిని తొలిచేస్తూ ఉంటుంది. మనుషులను గుర్తు పెట్టుకోవడానికి రాసుకున్న నోట్స్, ఆస్పత్రి రిపోర్ట్స్‌ను అప్పు కాల్చేయడం సగం కాలిన ముక్కల సాయంతో అపర్ణ ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించిన తర్వాత స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంది. చివరి 20 నిమిషాల్లో వచ్చే మలుపులు ఒకవైపు థ్రిల్ పంచుతూనే మరోవైపు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం అంటూ పలికే సంభాషణతో సినిమాను ముగించే తీరు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా మతిమరుపు కలిగిన వ్యక్తిగా విజయ రాఘవన్ తన నటనతో మరింత థ్రిల్ పంచారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.
కుటుంబంతో చూడొచ్చా - ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నిడివి 2 గంటల 16 నిమిషాలు. తెలుగు ఆడియోలోనూ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
ఇది కదా 'పుష్ప రాజ్' బ్రాండ్ అంటే- తెలుగులో తొలి సినిమాగా రికార్డ్!