Own House Vs Rental Home : సొంత ఇల్లు అనేది చాలా మందికి ఉండే ఒక కల. ఇందుకోసం తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వాడుతుంటారు. మరికొందరు తమ కలల సౌధాన్ని కట్టించుకోవడం కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఎలాంటి చీకూ, చింతా లేకుండా అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడిపేస్తుంటారు. మరి మీరేమి ఆలోచిస్తున్నారు?
ప్రస్తుతం హౌస్ మార్కెట్ చాలా ఒడుదొడుకుల్లో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనాలా? లేదా అద్దె ఇంట్లో ఉండాలా? వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్? అనేది ఇప్పుడు చూద్దాం.
ఇల్లు కొనడం వల్ల కలిగే లాభాలు
- బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు, కచ్చితంగా పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ ప్రకారం, ప్రిన్సిపల్ అమౌంట్‌పై (రూ.1.5 లక్షల వరకు) పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే సెక్షన్ 24 కింద, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీపై (రూ.2 లక్షల వరకు) ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది.
- ఇల్లు అనేది ఒక గొప్ప స్థిరాస్తి. ఏటా దీని విలువ (సుమారుగా) 8-10 శాతం వరకు పెరుగుతూ ఉంటుంది. ఇది మీ వారసులకు కొన్ని తరాలపాటు నీడనిస్తుంది. ఆర్థిక ఆలంబనగా ఉంటుంది.
- ప్రారంభంలో మీరు కట్టాల్సిన ఈఎంఐ ఎక్కువగా ఉందని అనిపించవచ్చు. కానీ భవిష్యత్‌లో మీ ఆదాయం పెరుగుతుంది. పైగా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుంది. కనుక కాలం గడుస్తున్న కొద్దీ ఫిక్స్‌డ్ ఈఎంఐ చెల్లించడం సులువైపోతుంది.
- సొంత ఇల్లు అనేది ఒక మానసిక సంతృప్తిని, భద్రతను ఇస్తుంది. అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
ఇల్లు కొనడం వల్ల కలిగే నష్టాలు
- ఇల్లు కొనాలంటే మీ వద్ద చాలా డబ్బు ఉండాలి. లేదా బ్యాంక్ లోన్ తీసుకోవాలి. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మొదలైనవి ఉంటాయి.
- ఇల్లు కొన్న తరువాత కచ్చితంగా దానికి ఎప్పటికప్పుడు రిపేర్లు, రెనోవేషన్లు చేస్తూ ఉండాలి. దీని వల్ల మీపై కొంత మేరకు ఆర్థిక భారం పడుతుంది.
- ఇంటిని ఎప్పుడంటే అప్పుడు అమ్మేసి డబ్బు చేసుకోలేం. మార్కెట్ పరిస్థితులను బట్టి ఇంటి ధరలు మారుతూ ఉంటాయి. పైగా ఈ ప్రోపర్టీ సెల్లింగ్ ప్రాసెస్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.
అద్దె ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలు
- అద్దె ఇంటికి చెల్లించాల్సిన రెంట్, హోమ్ లోన్ ఈఎంఐ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఆర్థిక భారం అంతగా ఉండదు.
- అద్దె ఇంటికి మహా అయితే 2 లేదా 3 నెలలకు సరిపడా అడ్వాన్స్ ఇస్తాం. అదే ఇల్లు కొనాలంటే చాలా పెద్ద మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
- సొంత ఇంటి నుంచి మరో ఇంటికి మారడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి అలా ఉండదు. నచ్చిన మరో ఇంటికి సులువుగా మారిపోవచ్చు. సొంత ఇల్లు ఉన్నవారు వేరే ఏరియాకు వెంటనే వెళ్లలేరు. కానీ అద్దె ఇంట్లో ఉండేవారు, తమకు నచ్చిన సిటీకి లేదా ప్రాంతానికి హాయిగా వెళ్లిపోవచ్చు.
అద్దె ఇంట్లో ఉండడం వల్ల కలిగే నష్టాలు
- అద్దె ఇంట్లో ఎంతకాలం పాటు ఉన్నా, దానికి మీరు యజమాని కాలేరు. పైగా ఇంటి యజమాని పెట్టే నియమ, నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ప్రతి దానికీ సర్దుకుపోవాల్సి వస్తుంది.
- కాలం గడుస్తున్న కొలదీ ఇంటి అద్దెలు పెరిగిపోతుంటాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా ఏటా 5-8 శాతం వరకు ఇంటి అద్దెలు పెరుగుతుంటాయి.
- మీరు ఉద్యోగం చేస్తున్నంత కాలం లేదా సంపాదిస్తున్నంత కాలం అద్దె చెల్లించగలుగుతారు. కానీ ఇంటి అద్దెలు మాత్రం జీవితాంతం కట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, సమయానికి ఇంటి అద్దె చెల్లించడం కష్టమవుతుంది.
చూశారు కదా! మీ ఆర్థిక పరిస్థితులు, మీ అవసరాలకు అనుగుణంగా సొంత ఇంట్లో ఉండాలా? లేదా అద్దె ఇంట్లో ఉండాలా? అనేది మీరే నిర్ణయించుకోవాలి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించడం మంచిది.
ఫస్ట్ టైమ్ ఇల్లు కొంటున్నారా? ఈ 8 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
హోమ్ లోన్ కోసం మంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే!