Tata Motors Demerger : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్లో కీలక పరిణామం జరిగింది. ఇకపై టాటా మోటర్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోద ముద్ర వేసింది. కమర్షియల్ వాహనాల వ్యాపారం, దాని సంబంధిత ఇన్వెస్ట్మెంట్లు ఒక సంస్థగా ఉండనుండగా, మరోవైపు ప్రయాణీకుల వాహనాల వ్యాపారాలు, విద్యుత్ వాహనాలు(ఈవీలు), జాగ్వార్ ల్యాండ్ రోవర్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లను మరో సంస్థగా విడదీయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ తెలిపింది.
'వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం ఉండదు'
ఎన్‌సీఎల్‌టీ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ కింద ఈ విభజన ప్రక్రియ జరుగుతుందని, టాటా మోటార్స్ షేర్ హోల్డర్లందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లో వాటాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. 'ప్రస్తుతం 3 వాహన వ్యాపారాలు స్వతంత్రంగా స్థిరమైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. విభజన ద్వారా విపణిలో ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు అవకాశం లభించనుంది. దీంతో పాటు ఆయా విభాగాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వాటాదార్లు, రుణదాతలు, రెగ్యులేటింగ్ సంస్థల అనుమతులు రావడానికి మరో 12-15 నెలల సమయం పట్టవచ్చు. టాటా రెండు సంస్థలుగా విడిపోయినప్పటికీ, ఉద్యోగులు, వినియోగదార్లు, మా వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం ఉండదని' టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు.
రెండు కంపెనీల్లోనూ వాటా ఉంటుంది!
'టాటా మోటార్స్ విభజన ఎన్‌సీఎల్‌టీ స్కీమ్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాదు టాటా మోటర్స్ లిమిటెడ్ షేర్ హోల్డర్లు అందరికీ, ఈ రెండు లిస్టెడ్ కంపెనీల్లోనూ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది' అని చంద్రశేఖరన్ తెలిపారు.
'టాటా గ్రూప్ ఆధ్వర్యంలో మూడు ఆటోమోటివ్ బిజినెస్లు స్వతంత్రంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఈ మూడు ఆటోమోటివ్ కంపెనీల విభజన ద్వారా అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో పాటు వాటిపై మరింత దృష్టి సారించేందుకు వీలు కలుగుతుంది' అని టాటా మోటర్స్ వెల్లడించింది. 'ఈ డీమెర్జర్ అనేది టాటా మోటార్స్ ఉద్యోగులకు మరింత వృద్ధి అవకాశాలను కలిగిస్తుంది. మా షేర్హోల్డర్ల వాటాల విలువను మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది' అని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఈ టాప్-5 మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే!
క్రెడిట్ కార్డ్ 'రివార్డ్ పాయింట్స్' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!