Sundar Pichai's Advice To Engineers : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. దీనితో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. తమకు ఉద్యోగాలు రావని, ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయోమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బట్టీ పట్టి చదవకండి!
విద్యార్థి దశలో ఉన్న వారెవరైనా రోట్ లెర్నింగ్‌కు అలవాటు పడకూదని అంటే బట్టి పట్టి చదవకూడదని సుందర్ పిచాయ్ సూచించారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో, టాప్ టెక్ కంపెనీలు అయిన FAANG (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) సంస్థల్లో యువతీ, యువకులు ఇంటర్వ్యూల్లో విజయం ఎలా సాధించాలి? ఉద్యోగం ఎలా సంపాదించాలి? అనే విషయాలపై సలహా ఇవ్వాలని ఇంటర్వ్యూయర్ సుందర్ పిచాయ్‌ని కోరారు. దీనితో రోట్ లెర్నింగ్ (బట్టీ పట్టి చదవడం) మంచిది కాదని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు. అప్పుడే నిజమైన విజయం లభిస్తుందని పేర్కొన్నారు. కనుక ఇదే పద్ధతిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అందరూ పాటించాలని సుందర్ పిచాయ్ సూచించారు.
త్రీ ఇడియట్స్ లాగా
ఏదైనా అంశాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాన్ని వివరించేందుకు 'త్రీ ఇడియట్స్' సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆయన గుర్తుచేశారు. త్రీ ఇడియట్స్ సినిమాలోని ఓ సన్నివేశంలో 'వాట్ ఈజ్ ఏ మెషిన్?' అని ప్రొఫెసర్ ఓ విద్యార్థి(హీరో)ని అడుగుతారు. అప్పుడు అతను కంఠస్థం చేసిన డెఫినిషన్ను చెప్పకుండా, సాధారణ పదాలతో యంత్రం అంటే ఏమిటో వివరిస్తాడు. అది ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేస్తాడు. విషయాన్ని గ్రహించడమంటే ఇదే అని సుందర్ పిచాయ్ అన్నారు.
‘‘ఎవరైనా సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవాలి. అలా చేస్తేనే సరిగ్గా పరివర్తన చెందగలరు. ఏదైనా సాధించగలరు అని నేను నమ్ముతాను’’ అని సుందర్ పిచాయ్ అన్నారు.
ఆ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం!
ఇదే ఇంటర్వ్యూలో ఇష్టమైన భారతీయ వంటకం ఏమిటని అడగగా, ప్రాంతాన్ని బట్టి తనకు వంటకాలు నచ్చుతాయని సుందర్ పిచాయ్ అన్నారు. "బెంగళూరులో ఉన్నప్పుడు దోశ బాగా తినేవాడిని. అది నాకు చాలా ఇష్టమైన టిఫిన్. దిల్లీలో ఉన్నప్పుడు చోలే బటూరె బాగా ఇష్టంగా తినేవాడిని. ఇక ముంబయిలో అయితే పావ్ భాజీ చాలా బాగుంటుంది’’ అని చెప్పారు.
స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాలా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్ పాటించండి!