Nithin Kamath Warns About Fake Trading Apps : ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జిరోదా సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్ కామత్ తన సోషల్‌మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో ఆయన ఓ వీడియోను షేర్ చేస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ''సరైన సంస్థలకు చెందిన యాప్‌లు అయితే ఎప్పటికీ ఉంటాయి. నకిలీవి మాత్రమే త్వరగా పెట్టుబడులు పెట్టాలని, సమయం మించిపోతుందని హడావిడి చేస్తాయి. అటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి'' అంటూ పోస్టు చేశారు.
Fake trading app scams have exploded and have become a mega nuisance.
— Nithin Kamath (@Nithin0dha) August 26, 2024
These scams work by inducing you to trade and making you think that making money is easy. So first, you are added to WhatsApp groups and then asked to install fake trading apps that look exactly like those of… pic.twitter.com/3CXHVq3Hj0
ప్రస్తుతం వివిధ స్టాక్ బ్రోకరేజ్ సంస్థలను కాపిచేస్తూ నకిలీ యాప్‌లు విపరీతంగా పుట్టుకొస్తున్నాయని నితిన్ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్న ప్రజలను ఇవి మరింత సులభంగా మోసం చేస్తున్నాయని తెలిపారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో తెలివి ఉన్నవారు కూడా ఇలాంటి యాప్‌ల ట్రాప్‌లో పడటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
ఈ హైటెక్ యుగంలో ఫేక్ ట్రేడింగ్ యాప్‌లు చేసే స్కామ్‌లు పెద్ద ఉపద్రవంగా మారాయని నితిన్ కామత్ అన్నారు. ఈ యాప్‌లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనను కలుగజేస్తాయన్నారు. అనంతరం నకిలీ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసి మాయ మాటలు చెప్తారని నితిన్ పేర్కొన్నారు. స్టాక్స్‌కు చెందిన ప్రముఖ సంస్థలలోని ప్రధాన బ్రోకర్ల మాదిరిగా ప్రవర్తిస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేలా చేస్తారని తెలిపారు. ప్రారంభంలో చాలా డబ్బులు సంపాదిస్తున్నాం అనిపించేలా వినియోగదారులను మభ్యపెడతారని హెచ్చరించారు. అనంతరం ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బును వారి అకౌంట్లలోకి బదిలీ చేసుకోవడంతో డబ్బు మాయమవుతుందని పేర్కొన్నారు.
నితిన్ పోస్ట్‌పై నెటిజన్లు నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ''ఈ స్కామ్‌లు రోజురోజుకు మరింత ఆధునీకరణతో వస్తున్నాయి. డబ్బు అత్యవసరం ఉన్న సమయంలో తెలివైన వారు కూడా వీటి మాయలో పడిపోతారు. ఇటువంటి నకిలీ యాప్‌లలో పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ స్పందిస్తూ ''అసలు ఏ యాప్‌లు నకిలీవో, ఏవి నిజమైనవో గుర్తించలేకపోతున్నాం. నకిలీ యాప్‌లు ప్రజల్లో నమ్మకం కలిగించి, వారు తేరుకునే లోగా మోసం చేస్తున్నాయి. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వాటిని మనం క్షుణ్ణంగా పరిశీలించలేకపోతున్నాం'' అని వ్యాఖ్యానించారు.
యూపీఐ తరహాలో ULI - ఇకపై మరింత ఈజీగా బ్యాంక్ లోన్స్! - RBI Introduces ULI