RBI Soon Stops the Rent Payments from Credit Cards: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం సర్వ సాధారణమైంది. బ్యాంకులు సైతం ఈజీగానే క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆ కార్డుల ద్వారా లక్షల్లో లావాదేవీలు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం క్రెడిట్ కార్డుల వినియోగంపై రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
క్రెడిట్ కార్డుల ద్వారా జనాలు పలు రకాల పేమెంట్లు చేస్తూ ఉంటారు. వస్తువుల కొనుగోళ్లు మాత్రమే కాకుండా.. ఇంటి అద్దె, షాప్ రెంట్స్, సొసైటీ ఫీజుల చెల్లింపులు, ట్యూషన్ ఫీజు పేమెంట్స్ వంటివి చేస్తుంటారు. అయితే.. వస్తు కొనుగోళ్లు మినహా మిగిలిన ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డు ద్వారా చేయడానికి వీళ్లేకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఎందుకంటే.. ఇవి వాస్తవంగా రూపొందించిన నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని రిజర్వు బ్యాంక్ భావిస్తోందట. క్రెడిట్ కార్డ్ అనేది కస్టమర్-వ్యాపారికి మధ్య జరిగే చెల్లింపుల కోసం తీసుకొచ్చారు.. పర్సన్ టూ పర్సన్ లావాదేవీల కోసం కాదని RBI అంటోంది.
క్రెడిట్ కార్డ్‌లు వాడుతున్నారా? ఈ అపోహలు & వాస్తవాలు గురించి తెలుసుకోండి! - Credit Card Myths
క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్-వ్యాపారి మధ్య కాకుండా.. పర్సన్ టూ పర్సన్ లావాదేవీలు జరగాలంటే, డబ్బు స్వీకరించే వ్యక్తి బిజినెస్ అకౌంట్ తెరవాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతూ వస్తోంది. గత ఫిబ్రవరి నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు అంచనా. వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే.. 26 శాతం పెరిగింది. అయితే.. ఈ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువగా రెంట్ పేమెంట్స్, ట్యూషన్ ఫీజులు, సొసైటీ ఫీజులే చెల్లించినట్టు రిజర్వు బ్యాంక్ గుర్తించిందట.
ఇంటి అద్దె క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేందుకు అనేక ఫిన్ టెక్ కంపెనీలు అవకాశం కల్పించటంతో.. ఇటీవలి కాలంలో కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. 1 నుంచి 3 శాతం ట్యాక్స్‌తో ఆయా సంస్థలు చెల్లింపులకు అనుమతి కల్పిస్తున్నాయి. అంతేకాదు.. రీ-పేమెంట్‌కు దాదాపు 45-50 రోజులు గడువు అందిస్తుండడంతో చాలా మంది ఇతర అవసరాల కోసమూ ఈ ఆప్షన్స్ వినియోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చెల్లింపులపై ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు అలర్ట్ అవుతున్నాయి. ఇలాంటి చెల్లింపులను ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. చాలా బ్యాంకులు అద్దె చెల్లింపుపై రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి. కొన్ని బ్యాంకులు వార్షిక రుసుమును మాఫీ చేయడానికి.. ఖర్చు పరిమితి నుంచి ఇంటి అద్దె, ట్యూషన్ ఫీజు చెల్లించే అవకాశాన్ని మినహాయించాయి. త్వరలోనే వీటిని పూర్తిగా నిలిపివేసే అవకాశాలు సైతం అధికంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.