New Driving Licence Rules : ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను గారాబంగా పెంచుతున్నారు. వారి అడిగింది కాదనకుండా అన్నీ కొనిస్తున్నారు. అలాగే కొంత మంది పేరెంట్స్ పిల్లలు (మైనర్లు) కారు లేదా బైక్ నడపడానికి అడిగితే వెంటనే ఇస్తున్నారు. మీరు కూడా ఇలాగే పిల్లలు అడిగిన వెంటనే కారు లేదా బైక్ తాళాలు చేతిలో పెడుతున్నారా? ఇక నుంచి అలా చేయకండి! నేటినుంచి దేశంలో డ్రైవింగ్ రూల్స్ మారాయి. ఈ రూల్స్ ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొత్త నియమాలు ఇవే!
దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి.. మోటార్ వాహనాల చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ రూల్స్ జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నియమాల ప్రకారం మైనర్లు కారు లేదా బైక్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఎవరైనా మితిమీరిన వేగంతో బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వెహికిల్ నడుపుతూ పట్టుబడినట్లయితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. అంతేకాదు సదరు వెహికిల్ యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును కూడా క్యాన్సిల్ చేస్తారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఇంకా మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి, పేరెంట్స్ పిల్లలకు బైక్ లేదా కారును నడపడానికి ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.
స్పీడ్‌గా వెళ్లడంతోనే ఎక్కువ ప్రమాదాలు :
దేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు మితిమీరిన వేగం వల్లే అధిక శాతం జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మైనర్లు స్పీడ్‌గా బైక్ లేదా కారును నడిపినప్పుడు కంట్రోల్ అవ్వకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే.. రోడ్డు భద్రతా నియమాలను కఠినతరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ జూన్ 1వ తేదీ నుంచి కొన్ని నియమాలు అమల్లోకి వచ్చాయి. దీంతోపాటు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు అమలులోకి తెచ్చింది. వీటి ప్రకారం.. ఇక నుంచి ఎవరైనా సరే జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్‌లకు హాజరై, వారు ఇచ్చిన డాక్యుమెంట్సతో లైసెన్స్ పొందవచ్చు.