Credit Card Reward Points : క్రెడిట్ కార్డును కొందరు ఎడాపెడా వాడేస్తుంటారు. రివార్డు పాయింట్లను పెంచుకునేందుకు కొంతమంది భారీగా క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేస్తుంటారు. దీనివల్ల రివార్డు పాయింట్లు పెరగడం సంగతి అలా ఉంచితే, బిల్లుల మోత మాత్రం తప్పకుండా పెరిగిపోతుంది. అందుకే అత్యవసర, సాధారణ ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డును వాడటం బెటర్. క్రెడిట్ కార్డుల వినియోగదారులు రివార్డు పాయింట్లను పెంచుకునేందుకు దోహదపడే లో రిస్క్ మార్గాల గురించి తెలుసుకుందాం.
తీరొక్క రివార్డు పాయింట్లు
రివార్డు పాయింట్లు రకరకాలు. ఇవి క్రెడిట్ కార్డును బట్టి మారిపోతుంటాయి. కొన్ని కార్డులు క్యాష్‌బ్యాక్ రివార్డులు అందిస్తాయి. ఇంకొన్ని మీరు కొనే మొత్తంలో కొంత శాతాన్ని క్యాష్ లేదా స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా తిరిగి మీకు అందజేస్తాయి. దీనివల్ల మీ క్రెడిట్ కార్డు బిల్లు కొంతమేర తగ్గుతుంది. కొన్ని కార్డులు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వంటివి కొనేటప్పుడు రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. గిఫ్ట్ కార్డులు లేదా వోచర్ల కోసం పాయింట్లను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కొన్ని కార్డులు ఇస్తాయి. వినియోగదారులు వీటిని రిటైల్/ఆన్‌లైన్ స్టోర్లలో వస్తువుల కొనుగోళ్ల కోసం వాడుకొని లబ్ధి పొందొచ్చు.
కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో బెనిఫిట్
కొన్ని కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఉదాహరణకు స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలతో బ్యాంకులు జతకట్టి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు బ్యాంకుతో టైఅప్ కలిగిన కంపెనీ నుంచి మనం సేవలు లేదా ఉత్పత్తులు పొందినప్పుడు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. అదే కంపెనీ నుంచి మనం తిరిగి వస్తువులను కొన్నప్పుడు మనం ఆ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఈ-కామర్స్‌లో తరుచుగా ఆర్డర్స్ పెట్టే వారికి ఈరకం కార్డులు బాగా ఉపయోగపడతాయి. డబ్బును ఆదా చేస్తాయి.
నిత్యావసరాల కొనుగోలు, యుటిలిటీ బిల్స్
ప్రతినెలా నిత్యావసరాలను కొనేందుకు, యుటిలిటీ బిల్లులను చెల్లించేందుకు కూడా చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా రివార్డు పాయింట్లు వస్తుంటాయి. ఈ పాయింట్లను రీడీమ్ చేసుకోవడం ద్వారా మనం క్యాష్‌బ్యాక్, ట్రావెల్ మైల్స్, గిఫ్ట్ వోచర్లను అందుకోవచ్చు. ఎక్కువ ఖర్చు చేస్తేనే ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయనే భావనను మనం వదిలేయాలి. మన బడ్జెట్‌కు అనుగుణంగా పొదుపుగా క్రెడిట్ కార్డు లిమిట్‌ను వాడినా తగినన్ని రివార్డు పాయింట్లు వస్తూనే ఉంటాయి. క్రెడిట్ కార్డు చేతిలో ఉన్నా, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేయాలి. అనవసర కొనుగోళ్లు మంచివి కాదు. రివార్డ్ పాయింట్లను సంపాదించడం కోసం మీ బడ్జెట్ పరిధిని దాటొద్దు. అత్యవసర ఖర్చులు అయిన కిరాణా, ఇంధనం వంటి రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును వాడేయండి. దీనివల్ల రివార్డులు వాటంతట అవే పెరుగుతుంటాయి. క్రెడ్, నోబ్రోకర్, రెడ్ జిరాఫీ వంటి వెబ్‌సైట్‌ల ద్వారా ఇంటి అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా కట్టొచ్చు. యుటిలిటీ బిల్లులను పే చేయొచ్చు.
బోనస్ రివార్డు పాయింట్లు
కొన్ని క్రెడిట్ కార్డులను డైనింగ్, కిరాణా, గ్యాస్, ట్రావెల్ ఖర్చులకు వాడితే బోనస్ రివార్డులు వస్తాయి. మరోసారి మనం అదే సేవను లేదా ఉత్పత్తిని పొందదల్చినప్పుడు ఈ బోనస్ రివార్డులను రీడీమ్ చేసుకోవచ్చు. బోనస్ రివార్డుల కోసం ఆశపడి ఎక్కువగా ఆర్డర్లు పెట్టడం మంచిదికాదు. చాలా క్రెడిట్ కార్డు సంస్థలు కొత్త కార్డుదారులకు సైన్-అప్ బోనస్‌లు, వెల్‌కమ్ ఆఫర్లు ఇస్తాయి. ఏటా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తేనే ఈ ప్రయోజనాలు మనకు దక్కుతాయి. ఇటువంటి క్రెడిట్ కార్డును తీసుకునే ముందు మనం సాధ్యమైనంత తక్కువ ఖర్చు టార్గెట్ కలిగిన దాన్ని ఎంచుకోవాలి. క్రెడిట్ కార్డును ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. మీ ఖర్చు అలవాట్లు, జీవనశైలికి అనుగుణంగా అది ఉండాలి. ఒకవేళ మీకు క్యాష్‌బ్యాక్ రివార్డులు కావాలంటే క్యాష్‌బ్యాక్ రేట్ కార్డు తీసుకోవాలి. మీ కార్డు రివార్డ్ స్కీమ్ గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. లావాదేవీల ద్వారా వచ్చే రివార్డు పాయింట్స్ ఎక్స్‌పైర్ కాకముందే రీడీమ్ చేసుకోవాలి.
మీ క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి - లేదంటే చాలా నష్టం సుమా! - Credit Card Lost Or Stolen