Mutual Fund Investment Strategies : కష్టపడి మనం సంపాదించిన సొమ్మును మనకోసం తిరిగి కష్టపడేలా చేస్తే వచ్చేవే రిటర్న్స్. అప్పుడే రూపాయికి రూపాయి జమ అవుతుంది. దీర్ఘకాల పెట్టుబడుల కోసం చూస్తున్నప్పుడు వైవిధ్యమైన పథకాలను ఎంచుకోవాలి. నష్టాన్ని భరించే సామర్థ్యం, మీ ముందున్న లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకున్న వాటిలో పెట్టుబడులు పెట్టాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్లు ఉపయోగపడతాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటేనే మీరు అనుకున్న రాబడిని పొందగలుగుతారు. మార్కెట్లు ఆధారంగా నడిచే పథకాల్లో మదుపు చేసినప్పుడు వైవిధ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలామంది మదుపరులు వైవిధ్యం గురించి పెద్దగా ఆలోచించకుండా, తోచిన ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు చూస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఏమంత మంచిది కాదు. ఎక్కువ సంఖ్యలో ఫండ్లను ఎంచుకోవడం వల్ల వాటిని పరిశీలించడమూ కష్టంగా మారుతుంది.
మీ అవసరం ఆధారంగా
పెట్టుబడుల్లో వైవిధ్యం అనేది మదుపరుల నష్టభయం, ఆదాయం అంచనాలను బట్టి మారుతుంది. ఉదాహరణకు యువ పెట్టుబడిదారులు ఈక్విటీ పథకాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పదవీ విరమణకు దగ్గరకు వచ్చిన వారు డెట్ పథకాలపై ఆసక్తి కనబరుస్తారు.
20-40 ఏళ్ల లోపు వయస్సున్నవారు పోర్ట్‌ఫోలియోలో 80 శాతం ఈక్విటీ స్కీముల్లో, 20 శాతం డెట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. అధిక రాబడి కోసం స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. కాస్త తక్కువ నష్టభయం ఉండేలా లార్జ్ క్యాప్ ఫండ్లలోనూ కొంత మొత్తం మదుపు చేయాలి. ఇలా అన్ని తరగతుల ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టభయాన్ని పరిమితం చేసుకుంటూ, లాభాలను ఆర్జించే వీలు కలుగుతుంది.
షేర్లను ఎంపిక చేసుకోవడంలో
మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకాలు ఏయే షేర్లలో పెట్టుబడులు పెడుతున్నాయో నిశితంగా పరిశీలించాలి. ఎంచుకున్న ఫండ్ పథకాల పెట్టుబడి తీరు ఒకేలా ఉంటే, వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటివి పేరుకు రెండు పథకాలుగా ఉంటాయిగానీ పనితీరు, లాభాలు అందించే విధానం దాదాపుగా ఒకేలా ఉంటాయి. కాబట్టి, ఇలాంటి పథకాల్లో మదుపు చేయకపోవడమే మంచిది. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు నష్టాలకూ దారి తీసే అవకాశం ఉంటుంది. వైవిధ్యమైన షేర్లలో పెట్టుబడులు పెట్టే పథకాలను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ఫండ్ ఫ్యాక్ట్‌షీట్లను పరిశీలించాలి.
ఫండ్ సంస్థలు
ఒకే ఫండ్ సంస్థ అందించే పథకాల్లోనే పూర్తిగా పెట్టుబడి ఉండకూడదు. ఒక్కో ఫండ్ సంస్థ భిన్నమైన వ్యూహాల్ని అనుసరిస్తుంది. ఒకే ఏఎంసీలో మదుపు చేస్తే, అది అనుసరించే విధానం వల్ల ఆదాయం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి, నాలుగు నుంచి ఆరు వరకూ ఫండ్ సంస్థలను ఎంచుకొవాలి, అందులో మంచి పనితీరున్న పథకాల్లో మదుపు చేయాలి. మార్కెట్ అస్థిరంగా కొనసాగుతున్నప్పుడు వారి పనితీరును అంచనా వేసేందుకూ ఈ అంశం ఎంతగానో తోడ్పడుతుంది.
క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేస్తున్నప్పుడు ఒకే రోజు అన్ని పథకాల్లోకీ పెట్టుబడి వెళ్లేలా ఉండకూడదు. నెలలో నాలుగైదు తేదీలను ఎంపిక చేసుకోవాలి. దీంతో సగటు ప్రయోజనం లభిస్తుంది. వైవిధ్యం పెట్టుబడిదారులు అనుసరించాల్సిన ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. అవసరమైనప్పుడల్లా పోర్ట్‌ఫోలియోను సరిదిద్దుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి లాభాలతో ఆర్థిక విజయం సాధించగుతాం.
మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule