Home Loan Letter From Bank : హోమ్‌లోన్ గురించి బ్యాంకు పంపిస్తున్న నోటీసులు ఇప్పుడు కొత్తవేమీ కావు. చాలా మందికి ఇలా వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. దీనిపై భయాందోళనలు చెందాల్సిన అవసరమూ లేదు. ఇలాంటి హెచ్చరికలు మీ ప్రయోజనం కోసమే. కేంద్ర బ్యాంకు అయిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిబంధనల మేరకు ఈ సమాచారం లోన్ తీసుకున్నవారికి అందుతోంది. ఇటీవలి కాలంలో హోమ్‌లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి. పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా EMI, వాయిదాలను సర్దుబాటు చేసే క్రమంలో బ్యాంకులు ఈ సమాచారాన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిస్తున్నాయి. రుణగ్రహీతల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకు తీసుకున్న చర్యలే ఇవి.
రుణ గ్రహీతకు స్పష్టమైన సమాచారం కోసం
లోన్ తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ రేటుకు, ఇప్పుడున్న వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ఈ వివరాలను బ్యాంకు రుణగ్రహీతకు స్పష్టంగా తెలియజేయాలని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలున్నాయి. రుణగ్రహీత బెంచ్‌మార్క్ రేటులో మార్పు వల్ల నెలవారీ వాయిదాలు (ఈఎంఐ), లోన్ వ్యవధి ఎలా ప్రభావితం అవుతుందన్న విషయాన్ని బ్యాంకులు ఈ ఉత్తరాల ద్వారా సమాచారాన్ని ఇస్తున్నాయి. ఉదాహరణకు మీ హోమ్‌లోన్ వడ్డీ రేటు 8 శాతం నుంచి 9 శాతానికి పెరిగిందనుకుందాం. ఇప్పుడు మీ వాయిదా మొత్తం పెరుగుతుంది లేదా మీ రుణ కాల పరిమితి పొడిగించవచ్చు. ఇది మీ మొత్తం ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపిస్తుంది.
తిరిగి చెల్లించే శక్తి ఉందా?
రుణగ్రహీతల చెల్లింపు శక్తిని అంచనా వేయడానికీ కొన్నిసార్లు బ్యాంకులు ఈ నోటీసులను పంపిస్తుంటాయి. నెలవారి వాయిదాలు పెరగడం, రుణ వ్యవధి అధికం అయినప్పుడు వాటిని తట్టుకునే వెసులుబాటు మీకుందా అనే విషయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా పరిశీలించాలి. జాబ్‌లో మార్పు, ఆదాయంలో హెచ్చుతగ్గుల్లాంటి సందర్భాల్లో ఇది చాలా కీలకం. వీటివల్ల లోన్ చెల్లింపు సామర్థ్యంపై ప్రభావం పడొచ్చు.
నెలవారీ వాయిదాలు- కాలపరిమితి
రుణం తీసుకున్నవారు తమ నెలవారీ వాయిదాలను (ఈఎంఐ) పెంచుకునేందుకు లేదా లోన్ కాలపరిమితిని పొడిగించుకోవడానికి లేదా రెండింటినీ కలిపి ఎంచుకునేందుకు బ్యాంకు అవకాశం కల్పిస్తోంది. మీకు ఆదాయం పెరిగితే వాయిదా మొత్తాన్ని పెంచుకునేందుకు మొగ్గు చూపొచ్చు. ఒక వేళ మీకు బడ్జెట్ పరిమితులు ఉంటే లోన్ కాలపరిమితిని పొడిగించడం వల్ల మీకు ఆర్థికంగా ఒత్తిడి ఉండదు. ఈఎంఐ పెంచుకున్నప్పుడు సహజంగానే కాలపరిమితి తగ్గుతుంది.
స్థిర వడ్డీ రేటుకు మారేందుకు
బ్యాంకు నుంచి వస్తున్న సమాచారాన్ని నిశితంగా పరిశీలించండి. మీరు చర (ఫ్లోటింగ్) వడ్డీ రేటులో ఉంటే స్థిర (ఫిక్స్‌డ్) వడ్డీ రేటుకు మారేందుకు బ్యాంకు అనుమతినిస్తుంది. దీనివల్ల వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. ఇలా మారాలంటే కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చలన వడ్డీతో పోలిస్తే ఫిక్సిడ్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది రుణగ్రహీతలు ఫిక్స్‌డ్ రేటుకు మారేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం కేవలం 5 శాతం మంది మాత్రమే స్థిర వడ్డీ విధానంలో కొనసాగుతున్నారు. వడ్డీ రేటులో స్థిరత్వం, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ ఉన్నప్పటికీ వడ్డీ రేటు అధికంగా కనిపించడం వల్ల రుణగ్రహీతలు దీనిపై అంతగా ఆసక్తి చూపించరు.
మరింత పారదర్శకత కోసం
లోన్‌కు సంబంధించి, ఇతర రుసుముల వసూలుకు సంబంధించి పూర్తి పారదర్శకత కోసం బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు చేసింది. బ్యాంకులు వసూలు చేస్తున్న రుసుములు, అదనపు ఖర్చులను రుణగ్రహీతలు ముందస్తుగా తెలుసుకునే హక్కు ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అందుకే బ్యాంకులు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉత్తరాలు పంపిస్తున్నాయి. దీనివల్ల మీకు రుణానికి సంబంధించిన వాటిపై అవగాహన పెరుగుతుంది.
ప్రతి మూడు నెలలకు ఓ సారి
లోన్‌కు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపులు, మిగిలిన ఈఎంఐలు, వార్షిక వడ్డీ తదితర వివరాలను పేర్కొంటూ బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఓ సారి నివేదికలను అందించాలి. ఈ వివరాలు సరళంగా, సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మీ రుణం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
క్రెడిట్ స్కోరు బాగుంటే?
ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోరున్న వారికి వడ్డీలో కొంత రాయితీని ఇస్తున్నాయి. మీ క్రెడిట్ స్కోరు ఓ సారి చెక్ చేసుకోండి. సిబిల్ స్కోరు ఆధారంగా ఎంత మేరకు వడ్డీని వసూలు చేస్తుందో తెలుసుకునేందుకు బ్యాంకు వెబ్‌సైటును చూడొచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం మీ వడ్డీ రేటు 9.5 శాతం ఉందనుకుందాం. మీ స్కోరు 800లకు పైగా ఉన్నట్లయితే 8.5 శాతం వడ్డీకి మార్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం బ్యాంకులు నిర్ణయించిన రుసుము మాత్రం చెల్లించక తప్పదు.
'లోన్లకు సంబంధించి, బ్యాంకు నుంచి వచ్చిన ప్రతి సమాచారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇవన్నీ మీ రుణాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తాయి. మీరు EMIలను సర్దుబాటు చేయాలన్నా, లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకున్నా, ఫిక్సిడ్ వడ్డీ రేటుకు మారాలన్నా ముందుగా మీ ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకోవడం అవసరం. సందేహాలుంటే మీ బ్యాంకు బ్రాంచి అధికారులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి' అని బ్యాంక్ బజార్ సీఈఓ అధిల్ శెట్టి తెలిపారు.
మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెడతారు?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్‌న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్