Wine Shops Close in Andhra Pradesh : ఏపీలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలబోతోంది. ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎప్పట్నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎలక్షన్ కౌంటింగ్ కోసం..
ఆంధ్రప్రదేశ్లో శాసన సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అటు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
పల్నాడును రణరంగంలా మార్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు- ప్రశాంత పోలింగ్ నిర్వహణపై సర్వత్రా అనుమానాలు
అల్లర్ల నేపథ్యంలో..
రాష్ట్రంలో పోలింగ్ వేళ మొదలైన అల్లర్లు.. ఆ తర్వాత కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్.. సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిపించి మరీ వివరణ తీసుకుంది. ఇలాంటి తరుణంలో మరోసారి పరిస్థితులు అదుపు తప్పకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హోటళ్లు, లాడ్జిల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త బ్రాండ్లు ఉన్నట్టా? లేనట్టా? - మద్యం కొత్త బ్రాండ్ల విషయంలో గందరగోళం
సోషల్ మీడియాపైనా కన్ను..
కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో.. సామాజిక మాధ్యలపైనా ఓ కన్నేసి ఉంచాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ఆ మూడు రోజులు మద్యం బంద్..
అగ్నికి ఆజ్యం పోసినట్టుగా.. అల్లర్లు చెలరేగడంలో మద్యం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
పల్నాడు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు - వైసీపీ పనేనన్న నేతలు